ఓపీఎస్‌‌‌‌ అమలు చేయకపోతే పోరాటమే : ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

ఓపీఎస్‌‌‌‌ అమలు చేయకపోతే పోరాటమే : ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని పదేండ్లు బీఆర్ఎస్ మోసం చేసిందని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు కూడా ఇచ్చిన హామీ ప్రకారం పాత పింఛన్ విధానాన్ని (ఓపీఎస్‌‌‌‌) అమలు చేయకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. గురువారం పీఆర్టీయూ ఆఫీసులో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్ రెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు.

 ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత సీపీఎస్ సమస్య పోతుందని ఉద్యోగ, ఉపాధ్యాయులు భావించారని, కానీ రాష్ట్రాల అభిప్రాయాలు అడిగినప్పుడు కేంద్రానికి సీపీఎస్ కొనసాగిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌‌‌‌లోనూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేశారని తెలిపారు.

 రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా.. ఇప్పటికీ సీపీఎస్ రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం గురుకులాల్లో టైమింగ్స్ మార్చాలని కోరారు. విద్యాశాఖలో ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ ఈఓ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.