
- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
వికారాబాద్, వెలుగు: పక్కా ప్లాన్తోనే మహేందర్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి బీసీ బిడ్డ అయిన స్వాతిని అతికిరాతకంగా హత్య చేశాడని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. శుక్రవారం వికారాబాద్ మండలం కామారెడ్డిగూడలోని స్వాతి తల్లిగారింటికి వెళ్లి ఆమె తల్లిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిని ఆమె భర్త మహేందర్ రెడ్డి నరికి చంపడం దారుణమన్నారు. మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి మహేందర్‌రెడ్డిని మాత్రమే అదుపులోకి తీసుకొని అతని కుటుంబాన్ని కాపాడుతున్నారని మండిపడ్డారు.
సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. అతి దారుణంగా చంపిన వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాల్సింది పోయి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో క్షేమంగా జైలుకు పంపిస్తున్నారని అన్నారు. స్వాతి కుటుంబానికి బీసీ సమాజం అండగా ఉంటుందని, ఈ ఘటనపై మండలిలో మాట్లాడుతానని పేర్కొన్నారు. బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాణి హరిశంకర్ గౌడ్, కోఆర్డినేటర్లు వట్టే జానయ్య యాదవ్ ఉన్నారు.