- రూ.11,500 కోట్లు కేటాయించి రూ.2,426 కోట్లు ఖర్చు చేయడంపై నిలదీత
- గత ప్రభుత్వం కంటే ఎక్కువే ఖర్చు చేశాం: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: బీసీల సంక్షేమం కోసం బడ్జెట్ లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి తక్కువగా ఖర్చు చేయడం ఏమిటని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీశారు. కేవలం ఇంకా రెండు నెలల గడువే ఉండగా ఇంకా 9 వేల కోట్లు ఎట్లా ఖర్చు చేస్తారని అడిగారు. బీసీల కోసం రూ.11,500 కోట్లు కేటాయించి రూ.2,426 కోట్లు ఖర్చు చేయడంపై ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్సీలు ప్రశ్నించారు.
బీసీ సబ్ ప్లాన్ గురించి చర్చకు పట్టుబట్టారు. దీంతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీసీ ప్రజాప్రతినిధులతో త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా బీసీ నిధుల ఖర్చులపై చర్చ జరిగింది.
ఏడాదిలో 2,426 ఖర్చు చేసినం: మంత్రి పొన్నం
బీసీల కోసం గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తే తాము ఒక్క ఏడాదిలోనే రూ.2,426 కోట్లు ఖర్చు చేశామని మంత్రి ప్రభాకర్ తెలిపారు. గతంలో విదేశీవిద్య కోసం 300 మంది కి ఇచ్చే స్కాలర్ షిప్స్ ను ఇప్పుడు 700 మందికి పెంచామని వివరించారు. అలాగే 100 నియోజకవర్గాల్లో ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి 200 కోట్లు ఖర్చు చేస్తూ రూ.20 వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్ట్‌లో బీసీ వర్గాలకు చెందిన నిధులు రూ.5 వేల కోట్లు ఉన్నాయని చెప్పారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను గ్రీన్ చానెల్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు.
