
- మాజీ సీఎం కేసీఆర్‌పై మల్లన్న ఫైర్
- 2022, 2023లో తన ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణ
- ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా మల్లన్న వాంగ్మూలం రికార్డు చేసిన సిట్
హైదరాబాద్,వెలుగు: బీఆర్ఎస్ ఓడిపోవడం వల్లే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిందని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అన్నారు. ప్రజల ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం అప్పటి ప్రభుత్వానికి ఏం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. సామాన్యుల ఫోన్లను మావోయిస్టు సానుభూతిపరులుగా ట్యాపింగ్ చేసిన కేసీఆర్.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు.
సిట్ దర్యాప్తులో భాగంగా సాక్షిగా గురువారం ఆయన తన వాంగ్మూలం ఇచ్చారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లోని ఏసీపీ వెంకటగిరికి తన స్టేట్‌మెంట్ ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన వినియోగించిన ఫోన్ నంబర్ వివరాలతో సిట్ అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు. వ్యక్తిగత వివరాలతో పాటు ఎన్నికల్లో ప్రచారం, ఇతర సమయాల్లో తనకు ఎదురైన సమస్యలు, అనుమానాస్పద ఘటనలకు సంబంధించి వివరాలు సేకరించారు.
సిట్ అధికారులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన అనంతరం మీడియాతో మల్లన్న మాట్లాడారు. కేసీఆర్ హయాంలో వేల ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు. తన ఫోన్లు 2022 అక్టోబరు 31వ తేదీ నుంచి 2023 అక్టోబరు వరకు ట్యాప్ చేశారని ఆరోపించారు. 2023 జులైలో మూడు నెలల పాటు మరో ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పారు. తన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.