నన్ను చంపాలని చూస్తరా?.. ఇక చూస్కుందాం: తీన్మార్ మల్లన్న

నన్ను చంపాలని చూస్తరా?.. ఇక చూస్కుందాం: తీన్మార్ మల్లన్న
  • మా బీసీల ఉద్యమంతో మీకేం సంబంధం
  • కల్వకుంట్ల కవితపై తీన్మార్​ మల్లన్న ఫైర్​
  • కంచం పొత్తు, మంచం పొత్తు అనేది తెలంగాణలో ఊతపదం
  • కంచం పొత్తు అంటే తినడం.. మంచం పొత్తు అంటే  వియ్యం ఇచ్చుకోవడం
  • నా వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని వెల్లడి

మేడిపల్లి, వెలుగు: హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని, దాడులకు భయపడబోమని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న హెచ్చరించారు. ‘‘నా పైనే దాడి చేసి చంపాలని చూస్తరా? ఇక చూస్కుందాం’’ అని ఫైర్​ అయ్యారు. దాడి ఘటన తర్వాత ఆఫీస్ ఎదుట తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. ‘‘మా గన్‌‌‌‌మ్యాన్ దగ్గర ఉన్న తుపాకీ లాక్కొని మరీ మా సిబ్బందిపై దాడి చేశారు. నాతో పాటు పలువురు గాయపడ్డారు. కల్వకుంట్ల కవిత, ఆమె కుటుంబం మాపై హత్యాయత్నానికి పాల్పడింది. ఇక మేం చూస్తూ ఊరుకోం.. మీరో, మేమో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మా బీసీల ఉద్యమంతో కవితకు ఏం సంబంధం?’’ అని ప్రశ్నించారు.  తాను చేసిన వ్యాఖ్యలకు తనపై ప్రజాస్వామ్యయుతం ఫిర్యాదు చేసే హక్కు వారికి ఉందని, కానీ రౌడీల్లా తమపై దాడి చేయడమే కాకుండా.. మళ్లీ తనమీదే  కేసు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘నా ఆఫీస్‌‌‌‌లో నా రక్తం, మా స్టాఫ్​రక్తం కండ్ల చూశారు. ఈ రక్తం మరకలతోనే ప్రజల్లోకి వెళ్తా. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలి. దాడి ఘటనపై ఇప్పటికే కంప్లైంట్ చేశాం. పోలీసులపై మాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉంది’’ అని తెలిపారు. కవిత శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. 

బీసీల కోసమే నా భవిష్యత్తు కార్యాచరణ

తాను చేసిన ‘కంచం..మంచం’ వ్యాఖ్యలపై ఇంకా కట్టుబడి ఉన్నానని తీన్మార్​ మల్లన్న అన్నారు. తాను తప్పు మాట్లాడానో లేదో  ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. ‘‘కంచం పొత్తు.. మంచం పొత్తు అనేది తెలంగాణ సామెత.. అది అది బూతు కాదు..తప్పు పదం కాదు.. తెలంగాణలో కురుమ, యాదవుల విషయంలో ఈ సామెత వాడుతరు. కురుమలు, యాదవుల వృత్తి గొర్రెల పెంపకం. వీరిద్దరి మధ్య కంచం పొత్తు ఉంటుంది కానీ, మంచం పొత్తు ఉండదు.. కంచం పొత్తు అంటే తినడం..కలిసి ఉండటం.. కలిసి పని చేయడం. మంచం పొత్తు అంటే  వియ్యం ఇచ్చుకోవడం.. పుచ్చుకోవడం .. పెండ్లి సంబంధాలకు వాడతరు .. ఇది అర్థం కాని వాళ్లను ఏమీ చేయలేం’’  అని కవితకు తేల్చిచెప్పారు. తనను చంపడానికే కుట్ర చేశారని మల్లన్న ఆరోపించారు. ‘‘బైరాన్​పల్లిలో మీ దొరలు మా ఆడబిడ్డలను నగ్నంగా బతుకమ్మ ఆడిపించిన్రు.. ఇప్పుడు కూడా మాపై దాడులు చేస్తున్నరు.. చూస్తూ ఊరుకోం” అని కవిత, ఆమె అనుచరులను హెచ్చరించారు. ‘‘బీసీల రాజకీయ పార్టీ రాకుండా ఉండాలనే ఈ దాడులు చేస్తున్నరు.. బీసీలను కలుపుకుని పార్టీ పెట్టి ప్రజా క్షేత్రంలోకి వెళ్తా.. బీసీల కోసమే నా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది’’ అని ఆయన ప్రకటించారు.  

కవిత ప్రధాన అనుచరుడు శివారెడ్డి ఆధ్వర్యంలోనే దాడి 

‘‘మా ఆఫీసుపై దాడి ఘటనలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాన అనుచరుడు కంచర్ల శివారెడ్డి కీలక పాత్ర పోషించిండు. శివారెడ్డి ముఖానికి మాస్క్ పెట్టుకుని అనుచరులను వెంటపెట్టుకొని వచ్చి దాడి చేశాడు’’ అని ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న  అన్నారు. ‘‘కవిత బంధువు సుజిత్ రావు మా గన్ మ్యాన్ నుంచి గన్ను లాక్కుని దాడి చేసే ప్రయత్నం చేసిండు. దీంతోనే గన్​మ్యాన్​ గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది’’ అని ఆయన తెలిపారు.