తెలంగాణ ఉద్యమ కారులు లేకపోతే.. సీఎంలు, మంత్రులు అయ్యేవాళ్లా? : ఎమ్మెల్సీ విజయ శాంతి

తెలంగాణ ఉద్యమ కారులు లేకపోతే..  సీఎంలు, మంత్రులు అయ్యేవాళ్లా? : ఎమ్మెల్సీ విజయ శాంతి
  •     సొంత సర్కార్‌ పైనే ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్
  •     ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: ‘తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే ఇవాళ ప్రత్యేక రాష్ట్రంలో సీఎంలు, మంత్రులు, అధికారులు ఉండేవారా’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి నిలదీశారు. సోమవారం శాసనమండలిలో స్పెషల్ మెన్షన్ కింద ఆమె మాట్లాడుతూ సొంత ప్రభుత్వంపైనే అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు రెండేళ్లు గడిచినా నెరవేరలేదని గుర్తుచేశారు. ‘ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఉద్యమకారులకు అనేక వాగ్దానాలు చేసింది. 

250 గజాల ఇంటి స్థలం, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు, నెలకు 4 వేల పెన్షన్, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌తోపాటు ఉద్యోగం ఇస్తామని చెప్పాం. కానీ ఇంతవరకు అమలు కాలేదు. కమిటీ వేస్తామన్నారు.. కానీ అది లేట్ అవుతోంది. ఉద్యమకారులు అసెంబ్లీ ముట్టడికి వస్తే అరెస్టులు చేయడం ఏంటి? వారిని పిలిచి మాట్లాడాలి. హామీలు నెరవేర్చకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుంది’ అని ఆమె హెచ్చరించారు. 

మూఢనమ్మకాలపై చట్టం తేవాలి: అద్దంకి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలనకు కఠినమైన చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. బిచ్చగాళ్ల కోసం సమగ్ర పాలసీని రూపొందించి, వారికి ఉపాధి కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో అవుట్ డోర్ అడ్వర్టైజ్‌మెంట్ జాగాలను కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తులకే కేటాయిస్తున్నారని, దీంతో చిన్న మీడియా ఓనర్లు రోడ్డున పడుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని వెంటనే సవరించి వందలాది కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 

పంటలు ఎండిపోతున్నాయి: నెల్లికంటి సత్యం

నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం, రాచకొండ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయని సీపీఎం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సభ దృష్టికి తెచ్చారు. బాధిత రైతులకు ఎకరానికి రూ.40 వేల పరిహారం ఇవ్వాలని, ఆ ప్రాంతానికి లిఫ్ట్ కెనాల్ నిర్మించాలని కోరారు. ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్న బ్యాక్‌ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కోరారు. సభలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు పలు ప్రజా సమస్యలను లేవనెత్తారు.