
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఎమెల్సీ విజయశాంతి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం (ఆగస్ట్ 30) గన్ పార్క్ దగ్గర ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ ఎందుకు రాడో అర్ధం కావడం లేదని అన్నారు. అసెంబ్లీకి రావాలన్న.. కాళేశ్వరం గురించి మాట్లాడాలన్న ఆయన సిక్ అవుతాడని ఎద్దేవా చేశారు. ప్రజల చేత ఎన్నికై ప్రజల తరుపున మాట్లాడని వ్యక్తికి పదవి ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి మొత్తమే రానని చెప్పి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాములమ్మ.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ఈసారైనా కేసీఆర్ సభకు వస్తున్నాడా.. రాడా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు ముద్దాయి కేసీఆరేనని.. ఆయన సభకు వచ్చి కాళేశ్వరంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన సభకు వస్తాడా లేదంటే మమ్మల్నే ఫామ్ హౌజ్‌కు రమ్మంటాడా చెప్పాలని నిలదీశారు.