- కేసీఆర్పై ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్
జూబ్లీహిల్స్, వెలుగు: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ కుక్కలు చింపిన విస్తరాకుగా మార్చారని ఎమ్మెల్సీ విజయశాంతి విమ ర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచా రంలో భాగంగా గురువారం బోరబండ బస్టాండ్లో జరిగిన కార్నర్ మీటింగ్లో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం కమీషన్లు, కుటుంబ ఆస్తులు పెంచుకోవడంపైనే దృష్టి పెట్టిందన్నారు. నియోజకవర్గంలో రోడ్లు వేసిన పాపాన పోలేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఫైరయ్యారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే.. యువకుడు, సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్న నవీన్ యాదవ్ కు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. ప్రజలకు నవీన్ నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి అని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చిందన్నారు. ఆయనను గెలిపించుకుంటే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
