ఏజెన్సీల్లో మొబైల్ డయాగ్నస్టిక్స్‌‌‌‌

ఏజెన్సీల్లో మొబైల్ డయాగ్నస్టిక్స్‌‌‌‌
  • ప్రజలందరికీ రక్త పరీక్షలు..
  • ప్రాథమిక స్థాయిలోనే రోగనిర్ధారణ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మొబైల్ డయాగ్నస్టిక్స్‌‌‌‌ యంత్రాలు ఏర్పాటుజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజన ప్రాంత ప్రజలకు అన్ని రకాల రక్త, మూత్ర పరీక్షలు చేసేలా ఒక్కోటి రూ.40 లక్షల వ్యయంతో 12 అత్యాధునిక యంత్రాలు కొనుగోలు చేయడానికి వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో నెలకు కనీసం ఒకసారి ఈ యంత్రాలతో ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా, రోగ నిర్ధారణ యంత్రాలు లేవు. వ్యాధి ముదిరేదాకా గిరిజనులు హాస్పిటల్​కు రావడంలేదు. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక స్థాయిలోనే రోగ నిర్ధారణ చేయగలిగితే, మరణాల సంఖ్యను బాగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం, సచివాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌ సమావేశం నిర్వహించారు. సీజనల్‌‌‌‌ రోగాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. వర్షాకాలం కావడంతో విష జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని, వీలైనంత తొందరగా మొబైల్​ల్యాబ్స్​అందుబాటులోకి తీసుకురావాలని ఈటల అధికారులకు సూచించారు.