మంచిర్యాల ఐడీవోసీలో ఆకట్టుకున్న మాక్ పార్లమెంట్

మంచిర్యాల ఐడీవోసీలో ఆకట్టుకున్న మాక్ పార్లమెంట్

మంచిర్యాల, వెలుగు: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల ఐడీవోసీలో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్ ఆకట్టుకుంది. ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాల సందర్భంగా స్నేహ సంఘాల సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. అచ్చం పార్లమెంట్​తరహాలో స్పీకర్, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ఎంపీలను అనుకరిస్తూ విద్యార్థులు పలు అంశాలపై ప్రశ్నలు వేశారు. వారి ప్రశ్నలకు ప్రధానమంత్రి, మంత్రులు సమాధానాలు చెప్పడం ఆకట్టుకుంది. 

చీఫ్​గెస్ట్​గా హాజరైన కలెక్టర్​ కుమార్​ దీపక్​ మాట్లాడుతూ.. ప్రజల యొక్క, - ప్రజల చేత, - ప్రజల కొరకు ఏర్పడిన ప్రజాస్వామ్యం మన దేశంలో కొనసాగుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు, మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డీఆర్డీవో కిషన్, డీఈవో యాదయ్య, డీపీవో వెంకటేశ్వర్​ రావు తదితరులు పాల్గొన్నారు. 

మాక్ పార్లమెంట్‌‌‌‌లో బాలికల ప్రతిభ

బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ కలెక్టరేట్‌‌‌‌లో కలెక్టర్​ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి మాక్ పార్లమెంట్​లో బాల్కొండ బాలికలు ప్రతిభ కనబర్చారు. కిశోర బాలికల సంఘాల స్థితిగతులు పురోగతి అంశంపై సమావేశం నిర్వహించగా బాల్కొండ మండలం నుంచి ముగ్గురు బాలికలు పాల్గొని ప్రతిభ చాటారు. కిసాన్ నగర్ కు చెందిన బి.అమృత, బాల్కొండకు చెందిన జె. అభిజ్ఞ, వి.స్త్రీనిధి హాజరై వివిధ అంశాలపై మాట్లాడారు.ఇందులో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన బి.అమృత రాష్ట్ర స్థాయి మాక్ పార్లమెంట్‌‌‌‌కు ఎంపికైంది. ఈ సందర్భంగా అమృతను కలెక్టర్ అభినందించారు.