- సీఎంవో ఆదేశాల మేరకే జీవో ఇచ్చామంటున్న అధికారులు
- సీఎంవో చెప్తే రూల్స్ పట్టించుకోరా అని టీచర్ సంఘాల ఫైర్
హైదరాబాద్, వెలుగు: మోడల్ స్కూల్ లో పనిచేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)ను ఏకంగా ఎస్సీఈఆర్టీలో లెక్చరర్‌గా శాశ్వతంగా విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఆ టీచర్ సొసైటీ పరిధిలో పనిచేస్తుండగా, ఎస్సీఈఆర్టీ పూర్తిగా గవర్నమెంట్ బాడీ. అదేదీ పట్టించుకోకుండా సర్కారు ఆర్డర్స్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మే 17న జీవో జారీ
రంగారెడ్డి జిల్లా పాలమాకుల మోడల్ స్కూల్లో ఎ.శారద 2014 నుంచి పీజీటీగా పనిచేస్తోంది. అధికారికంగా ఆమె ఎస్సీఈఆర్టీలో 2016 జులై13 నుంచి ఫారిన్ సర్వీస్ కింద చేరింది. అప్పటికే ఆమె ఓరల్ ఆర్డర్స్ పై పనిచేసినట్టు అధికారులు చెప్తున్నారు. సాధారణంగా ఐదేండ్లు ఫారిన్ సర్వీస్ పూర్తయితే పేరెంట్ డిపార్ట్మెంట్కు పంపించాలి. కానీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆ పని చేయడం లేదు. తాజాగా ఆ పీజీటీని ఏకంగా ఎస్సీఈఆర్టీ లెక్చరర్‌గా విలీనం చేస్తూ సర్కారు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు అప్పటి విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మే 17న జీవో రిలీజ్ చేశారు. దీంట్లోనూ సీఎంవో ఆదేశాలతోనే అంటూ పేర్కొనడం గమనార్హం. ఇది నిబంధనలకు విరుద్ధమని టీచర్ల సంఘాలు, అధికారులు చెబుతున్నారు.
నిబంధనలు గాలికి వదిలేశారు
మోడల్ స్కూల్లో పీజీటీ కేడర్ అంటే జూనియర్ లెక్చరర్ కంటే తక్కువ ర్యాంకు, నాన్ గెజిటెట్ పోస్టు. ఎస్సీఈఆర్టీ లెక్చరర్ అంటే డిప్యూటీ డీఈవో, బీఈడీ కాలేజీల్లో సీనియర్ లెక్చరర్ కేడర్, ఇది గెజిటెడ్ పోస్టు. ఈ పోస్టులో మూడేండ్లు పనిచేస్తే డీఈవోగా ప్రమోషన్ వస్తుంది. బీఈడీ కాలేజీ ప్రిన్సిపల్‌కు అర్హులు అవుతారు. ఈ రెండు పోస్టులను ఒకే గాటన ఎలా కట్టారనే ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. సాధారణంగా సీటీఈ, బీఈడీ కాలేజీల్లో లెక్చరర్లు మాత్రమే డిప్యుటేషన్/ఓడీపై ఎస్సీఈఆర్టీలో లెక్చరర్‌గా పనిచేసేందుకు అర్హులు. ఎస్సీఈఆర్టీ లెక్చరర్లకు యూజీసీ స్కేల్ అమలు చేస్తారు. అలాంటి పోస్టుల్లో జూనియర్‌ను ఎలా పంపిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒకే డీఎస్సీ ద్వారా రిక్రూటైన గవర్నమెంట్, లోకల్ బాడీ టీచర్లే వేర్వేరుగా ఉంటారు. అలాంటిది ఏకంగా సొసైటీ టీచర్‌ను ఎస్సీఈఆర్టీలో విలీనం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
