
ప్రధానివా.. ట్రంప్ ప్రచార కర్తవా?: మోడీపై కాంగ్రెస్ ఫైర్
అమెరికాలోని హ్యూస్టన్ లో గ్రాండ్ గా నిర్వహించిన ‘హౌడీ మోడీ’ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఫైర్ అయింది. ట్రంప్ కు మద్దతుగా అమెరికాలో మంచిగ ప్రచారం చేస్తున్నారంటూ మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ ఆనంద్ శర్మ.
వారం రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధాని మోడీ ఆదివారం హ్యూస్టన్ లో ‘హౌడీ మోడీ’ పేరుతో భారీ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో దాదాపు 50 వేల మందికి పైగా భారత అమెరికన్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో వచ్చే ఏడాది అమెరికా ఎన్నికల్లో భారత అమెరికన్లను మళ్లీ ట్రంప్ కు ఓటు వేయాలని చెబుతున్నట్లుగా ఉందన్నారాయన.
‘మీరు అమెరికా వెళ్లింది ఆ దేశ ఎన్నికల్లో స్టార్ ప్రచారకర్తగా కాదు.. భారత ప్రధానిగా వెళ్లారని గుర్తుపెట్టుకోండి’ అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు.
‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, వేరొక దేశ ఎన్నికల్లో కలగజేసుకోకూడదన్న మన విదేశాంగ విధానాన్ని మీరు ఉల్లంఘించారు. ఇది భారత సిద్ధాంతాన్ని అవమానించడమే. భారత దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను ఒక్క దెబ్బతో మీరు ధ్వంసం చేశారు. అమెరికాతో మన బంధం ఇటు రిపబ్లికన్లు, అటు డెమోక్రాట్లతో సమానంగా కొనసాగుతూ వస్తోంది. కానీ మీరు ట్రంప్ కు ప్రచారం చేస్తూ ఇరు దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీశారు’’ అంటూ ఆనంద్ శర్మ ట్వీట్ చేశారు.