
ఇజ్రాయెల్–హమాస్మధ్య యుద్ధం ముగింపునకు శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇజ్రాయెల్‌ప్రధాని నెతన్యాహుకు పీఎం నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
శుక్రవారం (అక్టోబర్ 10) నెతన్యాహుకు మోదీ ఫోన్ చేశారు. గాజాలో బందీల విడుదలకు అగ్రిమెంట్ చేసుకోవడంపై హర్షం వ్యక్తంచేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్తీసుకొచ్చిన 20 పాయింట్ల గాజా పీస్ప్లాన్పై చర్చించేందుకు ఇజ్రాయెల్సెక్యూరిటీ కేబినెట్ మీటింగ్‌ను నెతన్యాహు తాత్కాలికంగా నిలిపేసి మరీ మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘‘హమాస్‌తో ఒప్పందానికి సంబంధించి చర్చలు జరిపేందుకు సెక్యూరిటీ కేబినెట్ భేటీ అయ్యింది. ఇందులో నెతన్యాహుతోసహా కీలక అధికారులు పాల్గొన్నారు. అదే సమయంలో భారత ప్రధాని మోదీ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో నెతన్యాహు వెంటనే సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపేసి.. మోదీతో మాట్లాడారు. బందీలందరి విడుదలకు కుదిరిన అగ్రిమెంట్‌పై నెతన్యాహును మోదీ అభినందించారు” అని వెల్లడించింది.
నా స్నేహితుడికి ఫోన్‌చేసి అభినందించా: మోదీ
ఇజ్రాయెల్‌ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసిన విషయాన్ని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ‘‘నా స్నేహితుడు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్‌చేశా. పీస్ ప్లాన్‌లో భాగంగా గాజాలో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాధించిన పురోగతికి సంబంధించి అభినందించా. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయంపై ఒప్పందాన్ని మేం స్వాగతిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా.. ఏ రూపంలోనైనా ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు” అని పేర్కొన్నారు.