
- త్రివిధ దళాల చీఫ్‌లతో సమావేశం
- కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్,జైశంకర్ హాజరు
- అజిత్ దోవల్, ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్‌తో సెపరేట్‌గా మీటింగ్
- కాల్పుల విరమణ, యుద్ధ వ్యూహాలపై చర్చలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం రెండు హైలెవల్ సమావేశాలు జరిగాయి. ముందుగా కేంద్ర మంత్రులు, త్రివిధ దళాల అధిపతులతో మోదీ సమావేశమయ్యారు. కాల్పుల విరమణతో పాటు భద్రతాపరమైన పలు కీలక అంశాలపై చర్చించారు. ఆ తర్వాత మోదీ ప్రత్యేకంగా అజిత్ దోవల్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్‌తో మరో 30 నిమిషాలు సమావేశమయ్యారు. పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో)తో చర్చల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది.
సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల డీజీఎంవోలు మాట్లాడుకోవాల్సి ఉండగా, చర్చలను సాయంత్రం 5 గంటలకు పోస్ట్‌పోన్ చేశారు. కాగా, బార్డర్ వెంట పరిస్థితులను అధికారులు మోదీకి వివరించారు. ఇప్పటివరకు పాక్‌పై జరిపిన దాడుల గురించి బ్రీఫింగ్ ఇచ్చారు. మోదీ అధికారిక నివాసంలోనే సమావేశాలు జరిగాయి.
సరిహద్దు భద్రతపై కీలకంగా చర్చ
తొలి భేటీకి రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, జాతీయ అజిత్ దోవల్ హాజరయ్యారు. అదేవిధంగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ కూడా అటెండ్ అయ్యారు. పాకిస్తాన్ జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై మోదీ ఆరా తీశారు. పాకిస్తాన్ తోక జాడిస్తే.. గట్టిగా బదులివ్వాలని త్రివిధ దళాల అధిపతులను ఆదేశించినట్లు సమాచారం.
కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు, సరిహద్దు భద్రత, పాకిస్థాన్ నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అరికట్టడం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. భద్రతా దళాలు అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నాయని మోదీకి ఎయిర్ మార్షల్ ఏకే భారతి వివరించారు.