రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మోదీ ఘన స్వాగతం

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మోదీ ఘన స్వాగతం
  • పుతిన్​కు ప్రైవేట్ డిన్నర్​తో ఆతిథ్యం 
  • నేడు రాష్ట్రపతి భవన్​లో అధికారిక స్వాగతం 
  • హైదరాబాద్ హౌస్ వేదికగా ద్వైపాక్షిక చర్చలు
  • డిఫెన్స్, ట్రేడ్, ఎనర్జీ రంగాల్లో కుదరనున్న ఒప్పందాలు  
  • సాయంత్రం రాష్ట్రపతి భవన్​లో విందు.. రాత్రికి రష్యాకు పుతిన్

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం గురువారం సాయంత్రం ఇండియాకు వచ్చారు. ఢిల్లీ సమీపంలోని పాలెం ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దిగిన ఆయనకు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలికారు. పుతిన్​ను మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ఇద్దరూ కలిసి భారత సంప్రదాయ నృత్యాన్ని తిలకించారు. అక్కడి నుంచి ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసానికి చేరుకున్నారు. రాత్రి పుతిన్​కు మోదీ ప్రైవేట్ డిన్నర్​తో ఆతిథ్యం ఇచ్చారు. ఆ తర్వాత పుతిన్ ఐటీసీ మౌర్య హోటల్ చేరుకుని చాణక్య సూట్​లో 
బస చేశారు. పుతిన్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరుడు జులైలో ప్రధాని మోదీ మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్ కూడా ఇలాగే ప్రైవేట్ విందు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు 23వ ఇండియా-–-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి పుతిన్ ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ హౌస్ వేదికగా శుక్రవారం రక్షణ, వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఇంధనం, పరిశ్రమలు, అంతరిక్షం తదితర రంగాల్లో అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకునే అకాశం ఉంది. డిఫెన్స్ సెక్టార్​లో కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇండియా నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపైనా చర్చించనున్నారు. కాగా, రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో ఇండియాపై అమెరికా అదనపు సుంకాలు అమలు చేస్తున్న వేళ ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. 

పుతిన్ ఇయ్యాల్టి షెడ్యూల్

శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అధికారిక స్వాగతం లభిస్తుంది. అనంతరం పుతిన్ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి తన అధికార ప్రతినిధుల బృందంతో కలిసి హైదరాబాద్ హౌస్ చేరుకుంటారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు, ప్రతినిధి బృందాల స్థాయి డిస్కషన్స్ జరుగుతాయి. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వర్కింగ్ లంచ్ లో భోజనం చేస్తారు. తర్వాత రష్యన్ బ్రాడ్ కాస్టర్​కు చెందిన ఇండియా బేస్డ్ చానెల్​ను పుతిన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు రష్యా బయల్దేరి వెళ్లిపోతారు.

అమెరికా ఆంక్షల ప్రభావం లేకుండా.. 

అమెరికా ఆంక్షల ప్రభావం లేకుండా, ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూబుల్, రూపీ పద్ధతి వంటి చెల్లింపుల వ్యవహారంపై మోదీ, పుతిన్ మరింత స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్లు నిర్మించడానికి రష్యా భాగస్వామ్యాన్ని ఆఫర్ చేసింది. ఈ రంగంలో సహకారాన్ని పెంచడంపై కీలక ప్రకటన లేదంటే ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది.  తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అదనపు యూనిట్ల నిర్మాణంపై సహకారాన్ని కొనసాగించడం, ఇంధన సరఫరా స్థిరంగా ఉండేలా చూసుకోవడానికి, ముఖ్యంగా చమురు కొనుగోళ్లపై దీర్ఘకాలిక ఒప్పందాలపై చర్చించే అవకాశం ఉంది. రష్యాకు ఇండియన్ కార్మికులను సులభంగా నియమించుకోవడానికి వీలు కల్పించే, వారి హక్కులను పరిరక్షించే లేబర్ మొబిలిటీ డీల్​పై సంతకం చేసే అవకాశం ఉంది. కీలక రంగాలపై ఒప్పందాలు!

పుతిన్ 2 రోజుల ఇండియా పర్యటన సందర్భంగా ఇరు దేశాలు రక్షణ, వాణిజ్యం, ఇంధనం (ఎనర్జీ), అణు సహకారం వంటి కీలక రంగాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు కీలక ఒప్పందాలు, సంచలన నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది. ఇండియా.. ఆయుధాల దిగుమతుల్లో రష్యా ఇప్పటికీ అతిపెద్ద సరఫరాదారుగా ఉంది. ఈ నేపథ్యంలో రక్షణ రంగ సహకారాన్ని మరింత పటిష్టం చేయడంపైనే పుతిన్, మోదీ ప్రధానంగా చర్చించనున్నారు. ఇందులో భాగంగా డిఫెన్స్ లాజిస్టిక్స్ సహకార ఒప్పందాన్ని ఇరు దేశాలు అమలు చేయనున్నాయి. ఇప్పటికే రష్యా పార్లమెంట్ (స్టేట్ డ్యూమా) ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం కింద, ఇరు దేశాల మిలటరీ విమానాలు, నౌకలు, ఇతర యూనిట్లు పరస్పరం ఒకరి స్థావరాలను మరొకరు ఉపయోగించుకోవచ్చు. సైనిక విన్యాసాలు, శిక్షణ, మానవతా సాయం, విపత్తు సహాయక చర్యల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. 

2030 నాటికి100 బిలియన్ డాలర్ల వాణిజ్యం  

2030 నాటికి ‘స్ట్రాటజిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్’ కింద ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు (ప్రస్తుతం 68.7 బిలియన్ డాలర్లు) పెంచడంపై చర్చించనున్నారు. ఇండియా - యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ (ఈఏఈయూ), ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్​టీఏ)పై చర్చలు ప్రారంభిస్తారు. ఇండియన్ ఫార్మా, ఇంజనీరింగ్, ఫుడ్, టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్స్ ఎగుమతులు పెంచడంపై మాట్లాడుకోనున్నారు. 10 ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్లు, 15 వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇండియా ఎగుమతులు (ముఖ్యంగా ఫార్మా, వ్యవసాయం, యంత్రాలు) పెంచడానికి రష్యా మార్కెట్లలో అవకాశాలు కల్పించేందుకు ఒప్పందాలు చేసుకోవచ్చు.

ఉక్రెయిన్​తో వార్​పై చర్చించే చాన్స్!

ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ఇండియా తటస్థ వైఖరి అవలంబిస్తున్నది. శాంతియుత పరిష్కారాల కోసం ఇండియా చేస్తున్న ప్రయత్నాలను ఇప్పటికే పుతిన్ ప్రశంసించారు. అయితే, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ ఇండియా పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్, రష్యా వార్​పై పరస్పర అవగాహన కోసం చర్చించే అవకాశం ఉంది. ఈ వార్​కు త్వరగా శాంతియుత పరిష్కారం చూపాలని పుతిన్​ను మోదీ కోరే అవకాశం ఉన్నది.

డిఫెన్స్ డీల్​పై ఫోకస్ఇండియా ఇప్పటికే కొనుగోలు చేసిన ఎస్-400 

ఎయిర్​ డిఫెన్స్​ వ్యవస్థల సరఫరా ఆలస్యంపై చర్చించి, మిగిలిన యూనిట్ల డెలివరీని వేగవంతం చేయాలని పుతిన్​ను మోదీ కోరే అవకాశం ఉన్నది. ఇండియన్ ఎయిర్​ఫోర్స్ కోసం మరిన్ని ఎస్-400 యూనిట్లను కొనుగోలు చేసే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా రష్యా పేర్కొంటున్న సుఖోయ్ -57 ఐదో జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్​లు కొనుగోలు చేసే విషయంపైనా చర్చలు జరిగే చాన్స్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంత క్షిపణి అయిన ‘బ్రహ్మోస్’ ప్రోగ్రామ్​పై మరింత సహకారం, దాని డెవలప్​మెంట్​పై కీలక నిర్ణయం తీసుకోవచ్చు. ‘ఆత్మనిర్భర్ భారత్’ చొరవకు అనుగుణంగా, ఎస్-400 క్షిపణులతో సహా రక్షణ పరికరాల తయారీలో టెక్నాలజీ ట్రాన్స్​ఫర్ పెంచాలని రష్యాను ఇండియా కోరే అవకాశం ఉంది.

ప్రధాని మోదీ.. ఒత్తిడికి తలొగ్గే వ్యక్తి కాదు: పుతిన్

ప్రధాని మోదీ ‘ఒత్తిడికి లొంగిపోయే వ్యక్తి కాదు’ అని పుతిన్ నొక్కి చెప్పారు. ఇండియా నాయకత్వం పట్ల ప్రపంచం విశ్వాసం కలిగి ఉన్నదని తెలిపారు. మోదీ తన క్లోజ్ ఫ్రెండ్ అని, ఆయన్ను కలిసేందుకు ఇండియాకు వెళ్లడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. ఇండియా పర్యటనకు బయల్దేరే ముందు ఆయన అక్కడి మీడియాతో మాట్లాడారు. ‘‘అమెరికా నుంచి ఇండియాపై ఒత్తిడి (ఆయిల్ కొనుగోలు, టారిఫ్) ఉంది. ఇండియాతో వాణిజ్యం విషయంలో మూడో దేశం జోక్యం సహించం. ఇండియా అంటే మాకెంతో గౌరవం. రష్యాకు ఇండియా వ్యూహాత్మక భాగస్వామి. 2000 నుంచి ఇరు దేశాల మధ్య డిఫెన్స్ రంగం బలోపేతమైంది. మా మధ్య రక్షణ సహకారం స్థిరంగా కొనసాగుతున్నది. ఉక్రెయిన్​తో అనిశ్చితిపై ఇండియా సూచనలను గౌరవిస్తున్నాం’’అని పుతిన్ అన్నారు.

రాహుల్ గాంధీకి నో ఇన్విటేషన్

  •     ప్రధాని మోదీకి అభద్రతా భావం ఎక్కువ: రాహుల్ గాంధీ 
  •     పుతిన్ పర్యటన వేళ కేంద్రంపై ప్రతిపక్ష నేత విమర్శలు

న్యూఢిల్లీ:  తనను విదేశీ ప్రముఖు కలవకుండా కేంద్రం అడ్డుపడుతున్నదని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదీ మోదీ ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనమని విమర్శించారు. గురువారం ఆయన పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. " సాధారణంగా మన దేశ సంప్రదాయం ఏంటంటే..విదేశాల నుంచి వచ్చే అతిథులు ప్రతిపక్ష నేతను కలుస్తారు. దానికి కేంద్రం సహకరిస్తుంది. వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో ఈ సంప్రదాయం కొనసాగింది. కానీ ఇప్పుడు ఏమవుతోందంటే.. విదేశీ అతిథులు మన దేశానికి వచ్చినప్పుడు లేదా నేను విదేశాలకు వెళ్లినప్పుడు నన్ను కలవకూడదని వాళ్లకు మన మోదీ ప్రభుత్వమే సూచిస్తున్నది. ఇది ఎన్డీయే పాలసీ. ప్రతిసారీ ఇలాగే జరుగుతోంది. మిమ్మల్ని కలవొద్దని మీ ప్రభుత్వం నుంచి మాకు మెసేజ్ వచ్చిందని విదేశీ అతిథులే చెబుతున్నారు. కేవలం ప్రభుత్వం మాత్రమే భారత్ కాదు. ప్రతిపక్షం కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.  కానీ మోదీజీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్లకు అభద్రతా భావం ఎక్కువ" అని రాహుల్  విమర్శించారు.

ప్రొటోకాల్ పాటిస్తలేరు: ప్రియాంక గాంధీ 

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.."ఎన్డీయే ప్రభుత్వం అన్ని విషయాల్లో ఒకే విధానాన్ని అమలు చేస్తున్నది. ప్రతి ప్రజాస్వామ్యంలో ఒక ప్రొటోకాల్ ఉంటుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేక స్వరాలు వినిపించకుండా చేస్తున్నారు. అలాగే..విదేశీ అతిథులు వచ్చినప్పుడు ఎల్వోపీని కలవ కుండా చేసి ప్రొటోకాల్ బ్రేక్ చేస్తున్నారు" అని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కే.సీ. వేణుగోపాల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "విదేశీ అతిథులతో ఎల్వోపీ కలవడం ప్రజాస్వామ్య సంప్రదాయం. దీనివల్ల భారత్ అంతర్జాతీయ సంబంధాలు బలోపేతం అవుతాయి. కానీ 'మన్ కీ బాత్' మాత్రమే మాట్లాడాలనుకునేవాళ్లకు వీటి పట్ల గౌరవం ఉండదు" అని విమర్శించారు.