
Urjit Patel: రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నల్ డాక్టర్ ఉర్జిత్ పటేల్ IMF(అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితుడయ్యారు. ఈ హోదాలో ఉర్జిత్ పటేల్ భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. ఉర్జిత్ పటేల్ 3 సంవత్సరాల పదవీకాలానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాస్తవానికి మే నెలలో డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ పదవీకాలం ముగియడానికి 6 నెలల ముందుగానే.. ప్రభుత్వం పదవి నుంచి తొలగించిన తర్వాత ప్రస్తుతం ఉర్జిత్ పటేల్ నియామకం జరిగింది.
ఉర్జిత్ పటేల్ ప్రముఖ ఆర్థికవేత్త, భారతీయ సెంట్రల్ బ్యాంక్ (RBI) మాజీ గవర్నర్‌గా కూడా సేవ చేశారు. 2016 సెప్టెంబర్‌లో 24వ రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన పటేల్.. 2018 డిసెంబర్‌లో వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. ఆయన పదవి కాలం ఇతర గవర్నర్లతో పోలిస్తే చాలా తక్కువ సమయమే నడిచింది. ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉండటానికి ముందుగా పటేల్.. ఆర్థిక విధాన, గణాంకాలు, డిపాజిట్ ఇన్సూరెన్స్, కమ్యూనికేషన్ వంటి శాఖలతో పాటు మానిటరీ పాలసీ విభాగంలో డిప్యూటీ గవర్నర్‌గా కూడా పనిచేశారు.
ఉర్జిత్ పటేల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో బీఎస్ఈ ఎకనమిక్స్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్, యేల్ యూనివర్సిటీలో ఎకనమిక్స్ పీహెచ్డీ చేశారు. 1990లలో ఐఎంఎఫ్ లో ఆర్థికవేత్తగా పనిచేయటం స్టార్ట్ చేశారు. IMF డెప్యూటేషన్‌లో RBIకి చెందిన అనేక ప్రాజెక్ట్‌లు, విధాన రచనలకు సంప్రదాయదారు.
ఇక ఆయన కార్పొరేట్ ప్రపంచంలో కూడా అపారమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐడీఎఫ్సీ బ్యాంక్, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి కంపెనీల్లో పనిచేశారు. దీనికి తోడు ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. భారత ప్రభుత్వం పెద్ద డినామినేషన్ ఉన్న కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ డీమానిటైజేషన్ ప్రకటించిన సమయంలో రిజర్వు బ్యాంక్ గవర్నర్ హోదాలో ఉర్జిత్ పటేల్ ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత కొంత కాలానికి ఆయన పర్సనల్ కారణాలు చూపుతూ రాజీనామా సమర్పించారు.