
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు సరిపడా కోటా యూరియాను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయ రమణా రావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, భూపతి రెడ్డి అన్నారు. సోమవారం సీఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణా రావు మాట్లాడుతూ.. తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియాను కేటాయిస్తే.. ఇప్పటి వరకు 5.32 లక్షల టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేసిందని, ఇంకా 2.69 లక్షల టన్నుల లోటు ఏర్పడిందన్నారు. ఇక్కడి రైతులకు అన్యాయం చేసేలా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మండిపడ్డారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే యూరియాలో 50 శాతం వాటా ఈ రాష్ట్రానికే ఇవ్వాలి, కానీ ఇప్పటి వరకు 15 శాతం మాత్రమే ఇచ్చారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై, రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మండిపడ్డారు.