విప్లవాత్మక సంక్షేమ పథకాలు మోడీ చలువే

విప్లవాత్మక సంక్షేమ పథకాలు మోడీ చలువే

పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజీలేని  కృషి చేస్తోందని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రారంభోత్సవ ప్రసంగానికి సంబంధించిన వివరాలను శనివారం సాయంత్రం  మీడియా సమావేశంలో ఆమె  వెల్లడించారు.  గత 8 ఏళ్లలో పేదల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంక్షేమ పథకాల గురించి నడ్డా వివరించారని తెలిపారు.  సంక్షేమ ఫలాలను అర్హులైన పేదలకు చేరేలా  చేసిన ఘనత ప్రధాని మోడీకే  దక్కుతుందన్నారు.  రూ.1 కి బీమా, 11 కోట్ల మంది రైతులకు కిసాన్​ సమ్మాన్​ నిధి, ఎస్సీ, ఎస్టీ వికాస కార్యక్రమాలు బీజేపీ కృత నిశ్చయం వల్లే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.  పార్టీ వ్యవస్థాపకులు  శ్యామాప్రసాద్​ ముఖర్జీ చేసిన త్యాగాలను పార్టీ మరువబోదని,  ఆర్టికల్​ 370ని రద్దు చేయడం ద్వారా ఆ మహనీయుడి కలలను మోడీ సర్కారు నెరవేర్చిందన్నారు.  పండిత్​ దీన్​ దయాళ్​ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా పేదలకు సంక్షేమ ఫలాలను చేర్చేందుకు బీజేపీ సర్కారు ప్రయత్నిస్తోందని స్మృతీ ఇరానీ చెప్పారు.  సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్​ రావు తదితరులు పాల్గొన్నారు.