ప్రశ్నించిన వారంతా నక్సలైట్లు కాదు.. మోదీ ప్రభుత్వ విధానాలు దేశానికి మంచివి కావు

ప్రశ్నించిన వారంతా నక్సలైట్లు కాదు.. మోదీ ప్రభుత్వ విధానాలు దేశానికి మంచివి కావు
  •     మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

అశ్వారావుపేట, వెలుగు: ప్రశ్నించిన వారంతా నక్సలైట్లు కాదని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గుమ్మడి నర్సయ్య పేర్కొన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో శనివారం ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ విధానాలు దేశానికి మంచివి కావని తెలిపారు.

ప్రజల కోసం, వారి సమస్యల కోసం కష్టపడేవారు నేటి సమాజంలో కనిపించడం లేదన్నారు. తుపాకీ గొట్టంతో అధికారం వస్తుందని, ప్రజారాజ్యం వస్తుందని మాట్లాడిన వారు ఇటీవల లొంగిపోతున్నారని తెలిపారు. వారి సంగతి ఏమిటి? వారు ఏం చేయబోతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో బతుకుతారా? మళ్లీ ప్రజల కోసం పనిచేస్తారా? అనేది వేచి చూడాలన్నారు.

నక్సలైట్లు దేశాన్ని చెడగొడుతున్నారని, దేశాభివృద్ధికి అడ్డుపడుతున్నారనడం సరైంది కాదన్నారు. తమ పనులు చక్కబెట్టుకోవడం కోసం ఓ ముద్ర వేసి అణిచివేస్తున్నారన్నారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, పంటకు గిట్టుబాటు ధర రాక, పనికి తగ్గ వేతనం లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 24, 25 తేదీల్లో కామారెడ్డిలో రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు నాయిని రాజు, డి.సాయి, ప్రధాన కార్యదర్శి భిక్షం, రాము, గోకినేపల్లి ప్రభాకర్ పాల్గొన్నారు.