మోడీ సర్కారుకు కోర్టులో మూడు సవాళ్లు

మోడీ సర్కారుకు కోర్టులో మూడు సవాళ్లు

కేంద్రంలో రెండోసారి నరేంద్ర మోడీ సర్కార్ ఏర్పాటై వారమైనా తిరక్కముందే​ కొన్ని ప్రశ్నలకు బదులు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. 1. దేశవ్యాప్తంగా మదర్సాలు, మక్తబాలు, గురుకులాల్ని రెగ్యులరైజ్​ చేయాలని, 2. ఒక జంట ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనేలా చట్టాన్ని రూపొందించాలని, 3. ఒకే సివిల్​ కోడ్​(ఉమ్మడి చట్టం) అమల్లోకి తెచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో మూడు పిల్స్​ దాఖలయ్యాయి. ఆ పిల్స్​ను విచారించడానికి ముందు సర్కారు అభిప్రాయం తెల్సుకోవాలని కోర్టు భావించింది. సమాధానం చెప్పండంటూ మే 29, 31 తేదీల్లో కేంద్రానికి కోర్టు నోటీసులు కూడా పంపింది. ఈ మూడు అంశాలూ బీజేపీ పొలిటికల్​ ఎజెండాలోవి కావడం, ఆ పార్టీ నేతలు తరచూ డిమాండ్ చేసేవే కావడం, వాటిపై మేనిఫెస్టోలోనూ హామీలిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం చెప్పబోయే సమాధానాలపై, విచారణ జరగబోయే తీరుపై ఉత్కంఠనెలకొంది.

18వ శతాబ్దంనాటి పాఠాలేల?

ఢిల్లీ హైకోర్టులో దాఖలైన మూడు పిల్స్​లో మొదటిది రిలీజియస్​ స్కూల్స్​ రెగ్యులేషన్​కు సంబంధించింది. మదర్సాలు టెర్రరిస్టు ఫ్యాక్టరీలుగా తయారయ్యాయని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్​, ఇంకొందరు నేతలు బాహాటంగా కామెంట్లు చేశారు. మహరాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తూనే(2014లో) మదర్సాల గుర్తింపు రద్దుచేసింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్​బోర్డు చైర్మన్​ వసీమ్​ రిజ్వీ.. ప్రధాని మోడీకి రాసిన లేఖలో మదర్సాలన్నింటినీ మూసేయాలని కోరారు. మదర్సాలు మూసేస్తామని బీజేపీ అధికారికంగా ఎక్కడా చెప్పకున్నా, వాటిని ఆధునీకరించాలన్న అభిప్రాయాన్ని పలుమార్లు వ్యక్తం చేసింది. తాజాగా మదర్సా, మక్తబా(లైబ్రరీ), గురుకులాల్ని ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చేలా ఆదేశాలివ్వాలంటూ ఆర్టీఐ యాక్టివిస్ట్​ సునీల్​ సరోగీ, వెస్ట్​బెంగాల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే అఖ్రుజమాన్​ కలిసి ఢిల్లీ హైకోర్టులో పిల్​ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా 30 వేల పైచిలుకు మదర్సాల్లో సుమారు15 లక్షల మంది పిల్లలున్నారని, ఇప్పటికీ వాళ్లు 18వ శతాబ్దంనాటి పాఠాలే చదువుతున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు. మదర్సాలు, గురుకులాల్ని ప్రభుత్వ నియంత్రణలోకి తేవడం ద్వారా వాళ్లకు మత విద్యతోపాటు మోడ్రన్​ ఎడ్యుకేషన్​కూడా అందించే వీలవుతుందని, ఆ మేరకు కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్​ విచారణపై జులై 8న నిర్ణయం తీసుకుంటామన్న న్యాయమూర్తులు.. ఆ లోగా వైఖరి చెప్పాలని హెచ్​ఆర్​డీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఈ మేరకు మే 29న కేంద్రానికి నోటీసులిచ్చింది.

ఇండియా జనాభా 152 కోట్లా?

జనాభాను నియంత్రించేలా గతంలో వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ  ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసింది. నేషనల్​ పాపులేషన్​ పాలసీ పేరుతో డ్రాఫ్ట్​ను కూడా తయారుచేయించింది. అయితే 1994 నాటికే ఇండియా ఓ అంతర్జాతీయ డిక్లరేషన్​లో భాగస్వామి అయినందున సంస్కరణలు తేలేకపోయారు. ఇండియా సంతకం చేసిన ‘ఇంటర్నేషనల్​ కాన్ఫరెన్స్​ ఆన్​ పాపులేషన్​ అండ్ డెవలప్​మెంట్ డిక్లరేషన్​’ ప్రకారం జంటలకు ఎంతమంది పిల్లల్నైనా కనే హక్కు ఉంటుంది. వాజపేయి సర్కార్​ రూపొందించిన పాపులేషన్​ పాలసీని అమల్లోకి తేవాలంటూ ఇద్దరు బీజేపీ ఎంపీలు(2016లో ప్రహ్లాద్​ జోషి,  2017లో రాఘవ్​ లఖన్​పాల్​ శర్మ) లోక్​సభలో ప్రైవేట్​ మెంబర్​ బిల్లులు పెట్టారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనకుండా ఉండేలా చట్టం చేయాలంటూ 2016లో ‘పాపులేషన్​ కంట్రోల్​’ పేరుతో రూపొందిన బిల్లు ఓటింగ్​కు  రాకుండానే వీగిపోయింది. ముస్లింల జనాభాకు అనుగుణంగా ప్రతి హిందువు నలుగురైదుగురు పిల్లల్ని కనాలంటూ పలువురు బీజేపీ ఎంపీలు, నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా టూ చైల్డ్​ పాలసీని అమలు చేసేలా సర్కారును ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్​ దాఖలు చేసిన అశ్విని ఉపాధ్యాయ కూడా బీజేపీ నాయకుడే కావడం గమనార్హం.  ఆధార్​ కార్డు తీసుకోనివాళ్లు 20 కోట్లమందైనా ఉంటారని, ఆ లెక్కన దేశ జనాభా 152 కోట్లదాకా ఉంటుందని, టూ చైల్డ్​ పాలసీతోనే జనాభాను నియంత్రించొచ్చని ఉపాధ్యాయ తన పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలంటూ మే 29న కోర్టు నోటీసులిచ్చింది.

ఒకే  సివిల్​ కోడ్​

2019 లోక్​సభ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించిన మూడు ప్రధాన హామీల్లో ఒకే సివిల్​ కోడ్​(ఉమ్మడి పౌరస్మృతి) కూడా ఒకటి. జమ్మూకాశ్మీర్​కు స్వయంప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్​ రద్దు, రాజ్యంగ బద్ధంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం మిగతా రెండు ప్రధాన హామీలు. టూ చైల్డ్​ పాలసీపై పిల్​ దాఖలు చేసిన బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయనే.. ఒకే సివిల్​ కోడ్​పైనా పిటిషన్​ వేశారు. క్రిమినల్​ కేసుల్లో  దేశవ్యాప్తంగా  కామన్​ క్రిమినల్​ కోడ్ అమలవుతుండగా, సివిల్​ కేసుల్లో మాత్రం పర్సనల్​ లాబోర్డుల ప్రకారం నడుచుకోవటమేంటని ప్రశ్నించిన పిటిషనర్​, టర్కీ, ఈజిప్ట్​ లాంటి ఇస్లామిక్​ దేశాల్లో కూడా ఇలాంటి విధానం లేదని గుర్తుచేశారు. యూనిఫాం సివిల్​ కోడ్​ బిల్లును రూపొందించేందుకు జ్యూడీషియల్​ కమిషన్​ ఏర్పాటు చేసేలా మోడీ సర్కారుకు ఆదేశాలివ్వాలని ఉపాధ్యాయ తన పిటిషన్​లో కోరారు. దీనిపై వైఖరి చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, న్యాయ కమిషన్​కు మే 31న ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. పిటిషన్​పై విచారణ ప్రారంభించేలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ మూడు నోటీసులపై కేంద్రం ఏం సమాధానం చెబుతుందో వేచిచూడాలి.