ఎన్నికల్లో పోటీపడలేక రాజ్యసభకు వెళ్తున్నరు

ఎన్నికల్లో పోటీపడలేక రాజ్యసభకు వెళ్తున్నరు
  •     సోనియాగాంధీపై మోదీ పరోక్ష విమర్శలు
  •     రాజ్యసభ సీట్లకు రాజస్థాన్​ను అడ్డాగా మార్చుకున్నరు
  •     దేశంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉన్నది
  •     రాజస్థాన్​లోని జలోర్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని కామెంట్స్ 

జైపూర్ : ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసి గెలిచే సత్తాలేని కొందరు నేతలు.. రాజ్యసభకు వెళ్తున్నారని సోనియా గాంధీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా విమర్శించారు. పెద్దల సభకు వెళ్లేందుకు అలాంటి నేతలంతా రాజస్థాన్​ను అడ్డాగా మార్చుకున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరిలో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాతో పాటు పలువురు కీలక నేతలు రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ఈ నేపథ్యంలో మోదీ చేసిన కామెంట్లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్న మోదీ.. గతంలో చేసిన పాపాలకు ఇప్పుడు ఆ పార్టీ శిక్ష అనుభవిస్తున్నదని విమర్శించారు. ఒకప్పుడు 400 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు అభ్యర్థులే దొరకట్లేదని ఎద్దేవా చేశారు. దాదాపు 300 స్థానాల్లో అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. రాజస్థాన్​లోని జలోర్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ కీలక నేతలంతా లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతున్నారు. అందుకే రాజ్యసభకు వెళ్లిపోతున్నరు. ఇక్కడి ప్రజల్లో దేశభక్తి ఎక్కువ. ఇండియాను మరింత బలోపేతం చేయడం కాంగ్రెస్​కు చేత కాదని అందరికీ తెలుసు. 2014కు ముందు పరిస్థితులను ప్రజలు కోరుకోవట్లేదు’’అని ఎద్దేవా చేశారు.

స్కామ్​లకు కేరాఫ్ కాంగ్రెస్

బంధుప్రీతి, అవినీతి, దోపిడీ, స్కామ్, కుటుంబ పాలన అంటేనే కాంగ్రెస్ గుర్తుకొస్తుందని మోదీ అన్నారు. ఒకప్పుడు ఆ పార్టీ చేసిన పాపాలకు.. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నదని అన్నారు. ‘కాంగ్రెస్ నేతల ఫేస్ కూడా చూడకూడదని యువకులు అనుకుంటున్నరు. బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి. ఇండియా కూటమి పేరుతో అవకాశవాద కూటమి ఏర్పాటు చేశారు. కూటమిలోని పార్టీలే 25% సీట్లలో ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నాయి. గాలిపటం ఎగిరేముందే దారం తెగిపోయినట్టు కూటమి పరిస్థితి ఉంది. ఇలాంటి వాళ్ల చేతుల్లో దేశాన్ని పెడ్దామా?’’ అని ప్రశ్నించారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు టాయిలెట్లు, గ్యాస్, కరెంట్, నీళ్లు, బ్యాంక్ అకౌంట్లు, మౌలిక వసతులకు దూరం అయ్యారన్నారు. యూపీఏ హయాంలో ప్రధానికి గౌరవం ఉండేదికాదన్నారు.

భగవాన్ మహవీర్ బోధనలు అనుసరించాలి

భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన 2550వ భగవాన్ మహావీర్ నిర్వాన్ మహోత్సవ్‌‌‌‌ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మారక స్టాంప్, నాణేలను విడుదల చేశారు. భగవాన్ మహావీర్ బోధనలు ఈ ప్రపంచానికి అవసరమన్నారు. నేటి ప్రపంచానికి శాంతిని ప్రసాదించే పరిష్కార మార్గంగా జైన సిద్ధాంతాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ వస్తే మీ ఆస్తులు లాక్కుంటది 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తుల పున:పంపిణీ పేరుతో మీ ఆస్తులు లాక్కుని ముస్లింలకు పంచుతుంది. దేశ వనరులపై మైనారిటీ వర్గాలకే తొలి హక్కు ఉంటుందన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​ మాటలే దీనికి నిదర్శనం.  మహిళల వద్ద ఉన్న బంగారం మొత్తం లెక్కిస్తామని మేనిఫెస్టోలోనే పేర్కొంది. దానిని పున:పంపిణీ చేస్తామని తెలిపింది. అర్బన్ నక్సలైట్ మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నేతలు మహిళల మెడలోని మంగళ సూత్రాలను కూడా వదలరు.. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బు, నగలను చొరబాటు దారులకు పంచడం మీకు సమ్మతమేనా?

‑ నరేంద్ర మోదీ