మోదీ వంద మంది హిట్లర్లతో సమానం

మోదీ వంద మంది హిట్లర్లతో సమానం
  •  ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సులో వక్తలు

హనుమకొండ, వెలుగు : ఆధిపత్య కులాల సంపదకు మతాన్ని జోడించి ప్రజలను అణచివేస్తున్న ప్రధాని మోదీ వంద మంది హిట్లర్లతో సమానమని భారత్ బచావో జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత హోటల్​లో రాజ్యాంగ పరిరక్షణ జేఏసీ కన్వీనర్​ వెంగల్​రెడ్డి అధ్యక్షతన ‘ప్రజాస్వామ్య పరిరక్షణ పౌర సమాజ బాధ్యతలు’ అనే అంశంపై  సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గోపీనాథ్​ మాట్లాడుతూ రాష్ట్రంలో పదేండ్ల పాలనలో ఒక్క కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని, నిరుపేదల బతుకులు మారలేదన్నారు. 

రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు కన్నెగంటి రవి మాట్లాడుతూ బీజేపీ హయాంలో మహిళల మీద హింస పెరిగిందన్నారు. ఉద్యమకారుల జేఏసీ చైర్మన్, రిటైర్డ్ ప్రొఫెసర్​  కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని దోపీడీ వ్యవస్థగా మార్చిందని, యూనివర్సిటీలకు రీసెర్చ్​గ్రాంట్స్ కూడా ఇవ్వడం లేదన్నారు. వరంగల్ బార్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదుసర్, ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్, వివిధ సంఘాల లీడర్లు డాక్టర్ మార్క శంకర్ నారాయణ,  బి. రమాదేవి,  నున్న అప్పారావు,  జైసింగ్ రాథోడ్ పాల్గొన్నారు.