
మోడీ జీ.. వర్షాలు పడ్డా అంతేనా?
నీముచ్(మధ్యప్రదేశ్): మేఘాలు ఉండడం వల్ల మన ఫైటర్ విమానాలను పాక్ రాడార్లు పసిగట్టలేకపోయాయన్న ప్రధాని మోడీని కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ ఎగతాళి చేశారు. ‘మోడీజీ.. వర్షం పడుతున్నప్పుడు కూడా ఎయిర్‌క్రాఫ్ట్‌లు రాడార్లకు చిక్కవా’ అంటూ సెటైర్ విసిరారు. నిరుద్యోగులకు ఈ ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడారు. మోడీ–అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూపైనా పరోక్ష విమర్శలు చేశారు. ‘‘మోడీ జీ.. మామిడి పండ్లు ఎలా తినాలో మాకు నేర్పారు. దేశంలోని జాబులు లేనివారికి కూడా ఏం చేశారో చెప్పండి’’ అని అన్నారు.
జీఎస్టీతో, నోట్ల రద్దుతో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థకు బలమిచ్చేందుకు తమ పార్టీ కనీస ఆదాయం పేరిట ‘న్యాయ్’ స్కీంను తీసుకొస్తుందన్నారు. జీఎస్టీలో లోపాలు, పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, లక్షలాది మంది జాబులు కోల్పోయారని, నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిందని చెప్పారు. ‘‘నెలకు 12 వేల కన్నా తక్కువ ఆదాయం ఉన్న ఐదు కోట్ల ఫ్యామిలీలకు న్యాయ్ స్కీంతో లాభం చేకూరుతుంది. వారందరికి వారి బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.72 వేల చొప్పున జమచేస్తాం. అంటే ఐదేళ్లలో రూ.3.6 లక్షలు అందజేస్తాం. ఈ డబ్బుతో వాళ్లు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. న్యాయ్ అనేది ఒక ఆప్షన్ కాదు. నేటి అవసరం. ఈ స్కీంకు కావాల్సిన డబ్బులు అనిల్ అంబానీ, నీరవ్ మోడీ వంటి బడా పారిశ్రామికవేత్తల నుంచి వస్తాయి’’ అని అన్నారు.
మోడీ మా ఫ్యామిలీని అవమానిస్తున్నారు: రాహుల్
ఉజ్జయిన్ (మధ్యప్రదేశ్) : ప్రధాని మోడీ తన కుటుంబాన్ని అవమానిస్తున్నారని, కానీ మేం ఆయన కుటుంబం గురించి మాట్లాడమని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం ఆయన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘ప్రతి సభలో ప్రధాని మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. మన మధ్యలేని మా నాన్న, నానమ్మను ఘోరంగా అవమానిస్తున్నారు. మేం సంయమనంతో ఉంటాం. ఆయన అమ్మానాన్నల గురించి ఎప్పుడూ ప్రస్తావించం. ఎందుకంటే మేం బీజేపీ, ఆరెస్సెస్ మనుషులం కాదు. కాంగ్రెస్ వాదులం. ’ అని రాహుల్ అన్నారు. భారత్ యుద్ధవిమానాలను మేఘాలే కాపాడాయని మోడీ ఇప్పుడు చెబుతున్నారని, అసలు బాలాకోట్‌లో ఏం జరిగిందో ఇప్పటికైనా జనానికి చెప్పాలని డిమాండ్ చేశారు.