
- భారత్, రష్యా సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చ
- ఈ ఏడాది చివర్లో ఇండియాకు రావాలని పిలుపు
- బ్రెజిల్ అధ్యక్షుడితోనూ ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని
న్యూఢిల్లీ / మాస్కో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు భారత్, రష్యా మధ్య ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధ వివరాలను మోదీకి పుతిన్ తెలపగా.. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన విషయాలను మోదీ ట్వీట్ చేశారు.
"నా ఫ్రెండ్ పుతిన్‌తో ఇవాళ ఫోన్‌లో మాట్లాడాను. ఉక్రెయిన్‌తో యుద్ధానికి సంబంధించిన తాజా పరిణామాలను నాతో షేర్ చేసుకున్నందుకు పుతిన్‌కు ధన్యవాదాలు తెలిపాను. మేం ఇద్దరం భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై కూడా రివ్యూ చేశాం. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఈ ఏడాది చివర్లో భారత్ రావాలని పుతిన్‌ను ఆహ్వానించాం. ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాను" అని మోదీ పేర్కొన్నారు.
మన విదేశాంగ శాఖ కూడా ఓ ప్రకటనలో ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. మోదీ గురువారం బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో కూడా ఫోన్‌లో మాట్లాడారు. వ్యాపారం, సాంకేతికత, శక్తి, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, ప్రజల మధ్య సంబంధాలలో సహకారాన్ని మెరుగుపరచడంపై చర్చించారు. అయితే, రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై ఒత్తిడి చేస్తున్న ఈ సమయంలో మోదీ రష్య, బ్రెజిల్ అధ్యక్షులతో టచ్ లో ఉండటం ఆసక్తికరంగా మారింది.
పుతిన్‌తో అజిత్ దోవల్ భేటీ
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గురువారం క్రెమ్లిన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు. చర్చలు జరిపే ముందు దోవల్ పుతిన్‌ను కలిసిన వీడియో క్లిప్‌ను క్రెమ్లిన్ ప్రెస్ సర్వీస్ షేర్ చేసింది. పుతిన్ తన క్రెమ్లిన్ ఛాంబర్‌లోకి దోవల్‌ను హృదయపూర్వకంగా స్వాగతించారు.
ఎన్ని ఒత్తిడులున్న అన్ని రంగాల్లో రష్యా సహకారాన్ని కొనసాగించాలన్న కేంద్ర నిర్ణయాన్ని పుతిన్‌కు దోవల్ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరపున దోవల్ కూడా పుతిన్‌ను ఈ ఏడాది చివర్లో భారత్ కు రావాలని ఆహ్వానించారు. తన ఆహ్వానానికి పుతిన్ సానుకూలంగా స్వీకరించారని దోవల్ తెలిపారు. క్రెమ్లిన్ సమావేశంలో దోవల్‌తో పాటు భారత రాయబారి వినయ్ కుమార్, రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సెర్గీ షోయిగు కూడా ఉన్నారు.