దైవం ముందు ప్రజలు, భక్తులు అందరూ ఒక్కటే

దైవం ముందు ప్రజలు, భక్తులు అందరూ ఒక్కటే
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: “సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఉండాలని రామానుజస్వామి అడుగు జాడల్లో ఆయన స్ఫూర్తితో ప్రధాని మోడీ దేశాన్ని పాలిస్తున్నారు. ఇటీవల అలహాబాద్ లో గొప్ప కుంభమేళా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది హిందువులు హాజరయ్యారు. పారిశుధ్య కార్మికులకు పాదపూజ చేశారు. కాశీలో గొప్ప దేవాలయాన్ని మోడీ ప్రారంభించారు. గుడి కట్టిన కార్మికులతో మోడీ లంచ్ చేశారు. పేదలందరికీ టాయిలెట్స్ నిర్మాణం, బ్యాంక్ ఖాతాలు, కరోనా టైమ్ లో రూ.2 లక్షల 60 వేల కోట్లతో కేంద్రం తరఫున ఆహారం అందించారు. రామనుజచార్య  చూపించిన బాటను అమలు చేస్తున్నం” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం ముచ్చింతల్ లో 216 అడుగుల రామానుజాచార్య విగ్రహాన్ని ప్రధాని ప్రారంభించిన తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడారు. కొంత మంది అనేక రకాలుగా సమాజాన్ని విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. 1000 ఏండ్ల కింద జన్మించిన రామానుజాచార్యులు ఆరోజే సందేశం ఇచ్చారని,  దైవం ముందు ప్రజలు, భక్తులు అందరూ ఒక్కటే , సమానమే అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 8 ఏండ్లుగా చినజియర్ స్వామి ఎంతో కష్టపడి అందర్నీ సంప్రదిస్తూ.. గొప్ప కళాఖండాన్ని, ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ప్రపంచానికి అందించారని కిషన్ రెడ్డి అభినందించారు. ఈ కేంద్రాన్ని ప్రారంభించాలంటే మోడీ తప్ప మరెవరూ అర్హులు కారని స్వామి చెప్పారన్నారు. మోడీ చిన్నప్పటి నుంచి సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని, తన జీవితంలో ఎన్నో కష్ట సుఖాలను ఎదుర్కున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఇప్పుడు హైదరాబాద్ ల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో రామానుజచార్య విగ్రహాన్ని  మోడీ ప్రారంభించారన్నారు. ప్రపంచ పర్యాటక పటంలో హైదరాబాద్‌ కీలక కేంద్రంగా నిలవబోతోందన్నారు.  విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కేంద్రం తరఫున కృతజ్ఞతలు అని కిషన్ రెడ్డి చెప్పారు.  ప్రపంచంలోని హిందూవులందరూ ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలని ఆయన సూచించారు. కేంద్రం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.