నేతాజీ బాటలో నడిచి ఉంటే.. దేశం ఉన్నత శిఖరాలను చేరేది

నేతాజీ బాటలో నడిచి ఉంటే.. దేశం ఉన్నత శిఖరాలను చేరేది
  • రాజ్ పథ్ పేరు చరిత్రలో కలిసింది: మోడీ
  • ఇండియా గేట్ వద్ద సుభాష్​ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ  
  • కర్తవ్యపథ్, సెంట్రల్ విస్టా లాన్స్ కూడా ప్రారంభం

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన బాటలో నడిచి ఉంటే.. దేశం ఉన్నత శిఖరాలను చేరి ఉండేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దురదృష్టవశాత్తు ఆయనను మరిచిపోయారని విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు అనేక సౌలతులతో తీర్చిదిద్దిన ‘కర్తవ్యపథ్’ రోడ్డును, సెంట్రల్ విస్టా లాన్స్​ను గురువారం సాయంత్రం ప్రధాని ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన 28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని కూడా మోడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కర్తవ్యపథ్​కు ఇంతకుముందున్న రాజ్ పథ్ అనే పేరు బ్రిటీష్ కాలం నాటి బానిసత్వానికి సంకేతంగా ఉండేదన్నారు. రాజ్ పథ్ పేరును కర్తవ్యపథ్​గా మార్చడంతో దేశానికి కొత్త శక్తి, స్ఫూర్తి వచ్చాయన్నారు. ‘‘ఇయ్యాల్టి నుంచి రాజ్ పథ్ అనే పేరు చరిత్రగా మారింది. కర్తవ్యపథ్​తో కొత్త చరిత్ర మొదలైంది. ఇయ్యాల కర్తవ్యపథ్ ఆర్కిటెక్చర్, స్ఫూర్తి మారిపోయాయి.

ఈ రూట్లో మంత్రులు, ఆఫీసర్లు వెళ్తుంటే.. ఇకపై వారి కర్తవ్యాన్ని ఇది గుర్తు చేస్తుంది” అని మోడీ చెప్పారు. సెంట్రల్ విస్టా అవెన్యూ రీడెవలప్​మెంట్​లో పాల్గొన్న కార్మికులను రిపబ్లిక్ డే వేడుకలకు గెస్టులుగా పిలుస్తామన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్‌‌‌‌దీప్ సింగ్ పురి, జి.కిషన్‌‌రెడ్డి, ఇతర మంత్రులు, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. కాగా, నేతాజీ విగ్రహాన్ని ఖమ్మం నుంచి తెచ్చిన 280 టన్నుల బరువున్న ఏకశిలా గ్రానైట్ బ్లాక్ నుంచి చెక్కారు.

విజిటర్స్​కు స్పెషల్ బస్సులు

సెంట్రల్ విస్టాను చూసేందుకు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఢిల్లీ మెట్రో వెల్లడించింది. శుక్రవారం నుంచి వారం పాటు సాయంత్రం 5 నుంచి 9 వరకు 12 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని చెప్పింది. ఇవి భైరాన్ రోడ్, రాజ్ ఘాట్, కన్నాట్ ప్లేస్, జేఎల్ఎన్ స్టేడియం నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇక 'కర్తవ్య పథ్' చుట్టూ ఢిల్లీ పోలీసు సిబ్బందితో పాటు 80 మందికి పైగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ భద్రత, రెండు నెలల పాటు ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన సౌలతులకు ఎలాంటి నష్టం జరగకుండా భద్రతా సిబ్బంది నిఘా పెడతారని చెప్పారు. సందర్శకులకు మాత్రం ఆంక్షలు ఉండవన్నారు.