
- కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చిద్దాం రండి: ప్రధాని మోడీ
- రైతుల ముందు తల వంచుతం.. వాళ్లు చెప్పేది వింటం..
- కొత్త వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తెచ్చినవి కాదు
- మధ్యప్రదేశ్ రైతులతో వీడియో కాన్ఫరెన్స్
వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు తప్పడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఫైరయ్యారు. ప్రభుత్వంపై కాల్పులు జరిపేందుకు రైతుల భుజాలపై తుపాకులు పెట్టారని ఆరోపించారు. ఎన్నో దేశాలు కొత్త టెక్నాలజీలతో ముందుకు పోతున్నాయని, మన దేశ రైతులు వెనుకబడకూడదన్నారు. రైతులకు మేలు చేసే ఇలాంటి వ్యవసాయ చట్టాలు ఇప్పటికే వచ్చి ఉండాల్సిందన్నారు. పొలిటికల్ పార్టీలు, అగ్రికల్చర్ ఎక్స్పర్టులు, రైతులు ఇలాంటి రీఫామ్స్‌ను ఎప్పుటి నుంచో డిమాండ్ చేస్తున్నారన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని తొలగించాలని అనుకుంటే.. స్వామినాథన్ కమిషన్ రికమండేషన్లను ఎందుకు అమలు చేస్తామని మోడీ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ/భోపాల్: రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు. మూడు అగ్రి చట్టాలను పార్లమెంటులో తొందరతొందరగా ఆమోదించలేదని, వాటిపై దశాబ్దాలపాటు చర్చలు జరిగాయని చెప్పారు. రైతుల జీవితాలను మరింత మెరుగుపరిచేందుకు తాము వేసిన ముందడుగు అని చెప్పారు. ‘‘అగ్రి చట్టాలపై అబద్ధాలు స్ప్రెడ్ అవుతున్నాయి. వాటిని నమ్మొద్దు. మేం వివరణ ఇచ్చాక కూడా ఎవరికైనా అనుమానాలుంటే వారి ముందు మేం తలలు వంచుకుని, చేతులు జోడించి.. చర్చించేందుకు రెడీగా ఉన్నాం. వారు చెప్పేది వింటాం. ఎందుకంటే రైతుల సంక్షేమమే మా ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ” అని చెప్పారు. రైతులతో 24 గంటలూ చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. శుక్రవారం మధ్యప్రదేశ్‌కు చెందిన రైతులతో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా మోడీ మాట్లాడారు.
ఎప్పుడో జరగాల్సినవి
వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు పుకార్లు వ్యాప్తి చేస్తున్నాయని మోడీ మండిపడ్డారు. ‘‘ప్రభుత్వంపై కాల్పులు జరిపేందుకు మీరు రైతుల భుజాలపై తుపాకులు పెట్టారు” అని ఆరోపించారు. ‘‘ఎన్నో దేశాలు కొత్త టెక్నాలజీలతో ముందుకు పోతున్నప్పుడు.. మన దేశ రైతులు వెనుకబడి ఉండకూడదు. ఇప్పుడు వ్యవసాయ చట్టాలపై చాలా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఇవి చాలా కాలం కిందటే జరిగి ఉండాలి. ఈ చట్టాలు రాత్రికి రాత్రి తెచ్చినవి కాదు. మన రైతులు వీటి కోసం దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో పొలిటికల్ పార్టీలు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలను మనం చూస్తే.. అందులో ఇవే హామీలు కనిపిస్తాయి’’ అని ప్రధాని చెప్పారు. అగ్రికల్చర్ రీఫామ్స్‌పై గత 20 నుంచి 22 ఏళ్లుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. పొలిటికల్ పార్టీలు, అగ్రికల్చర్ ఎక్స్పర్టులు, రైతులు ఇలాంటి రీఫార్మ్స్‌ను ఎప్పుటి నుంచో డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.
క్రెడిట్ మీరే తీసుకోండి
అపొజిషన్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మోడీ ఆరోపించారు. ‘‘వ్యవసాయ చట్టాలతో వాళ్ల (ప్రతిపక్ష పార్టీలు)కు సమస్య ఉందని నేను అనుకోవడం లేదు. వాళ్లు హామీ ఇచ్చినా చేయనివి.. మోడీ చేస్తున్నాడు కాబట్టే వాళ్లకు ప్రాబ్లమ్. అన్ని పొలిటికల్ పార్టీలకు చేతులు జోడించి అడుగుతున్నా.. క్రెడిట్ అంతా మీరు తీసుకోండి. రైతులను తప్పుదోవ పట్టించడం, అబద్ధాలు చెప్పడం ఆపండి” అని కోరారు.
న్యూ ఇయర్‌లోపు పరిష్కారం: తోమర్
కొత్త చట్టాల విషయంలో రైతుల ఆందోళనలను న్యూ ఇయర్‌లోపు పరిష్కరిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ చెప్పారు. క్రైసిస్‌ను ముగించేందుకు వివిధ గ్రూపులతో ఇన్ఫార్మల్ చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. రైతు సంఘాలతో చర్చలకు ఎప్పుడైనా రెడీ అని అన్నారు.
ఎంఎస్పీ వ్యవస్థ అంతం కాదు..
‘‘నిజంగా ఎంఎస్పీని తొలగించాలని అనుకుంటే.. స్వామినాథన్ కమిషన్ రికమండేషన్లను మేం ఎందుకు అమలు చేస్తాం. కొన్ని నెలల కిందటే కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. కానీ ఎంఎస్పీ సిస్టమ్ ఇంకా కొనసాగుతోంది కదా. కానీ ఎంఎస్పీ ఉండదని ప్రచారం చేస్తున్నారు. ఇంతకంటే పెద్ద అబద్ధం, పెద్ద కుట్ర ఇంకోటి ఉండదు” అని మోడీ అన్నారు. ఎంఎస్పీ వ్యవస్థ అంతం కాదన్నారు. ‘‘గత ప్రభుత్వం గోధుమలకు రూ.1,400, వరికి రూ.1,310 ఇచ్చేది. మేం గోధుమలకు రూ.1,975, వరికి రూ.1,870కి పెంచాం” అని వివరించారు.