నాకు ఒక బంగ్లా కూడా లేదు..ఏం చేసినా దేశంకోసమే: మోడీ

నాకు ఒక బంగ్లా కూడా లేదు..ఏం చేసినా దేశంకోసమే: మోడీ

యూపీ : ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజీపూర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై విమర్శలు చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రాజీవ్ గాంధీ హయాంలో సిక్కుల ఊచకోత అంశంపై ఆ పార్టీ నాయకుడు శామ్ పిట్రోడా చేసిన కామెంట్స్ ను మరోసారి హైలైట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కానీ.. వారికి మద్దతిస్తున్న పార్టీలు కానీ.. కేవలం 3 పదాల ఆధారంగా దేశాన్ని పాలించాయని అన్నారు. అయ్యిందేదో అయ్యింది.. అన్నట్టుగా ఓ ప్రణాళిక లేకుండా పరిపాలించాయని అన్నారు.

నాకు, నా కుటుంబానికి ఒక బంగ్లా కూడా లేదు..

“గుజరాత్ రాష్ట్రాన్ని అత్యంత సుదీర్ఘకాలం పరిపాలించిన ముఖ్యమంత్రిని నేను. దేశానికి ఐదేళ్లుగా ప్రధానిగా ఉన్నాను. నా బ్యాంక్ అకౌంట్ చెక్ చేయండి. ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుస్తుంది. నా పేరు మీద ఒక్క బంగ్లా ఐనా ఉందా చూపించండి. నాకోసం, నా ఫ్యామిలీ కోసం ఏమీ దాచుకోలేదు. దేశంకోసం.. దేశ ప్రజలకోసమే అన్నీ చేస్తున్నా” అన్నారు మోడీ.

“రాజస్థాన్ లోని అల్వార్ లో ఇటీవల ఓ దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరిగితే.. అక్కడి ప్రభుత్వం దోషులను పట్టుకోవడం లేదు. కేసును క్లోజ్ చేయడానికి అక్కడి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు గమనించాలి” అన్నారు మోడీ.