చైనాకు వార్నింగ్​..ఇండో‌‌–పసిఫిక్​లో మిలిటరీ చర్యలను సహించం

చైనాకు వార్నింగ్​..ఇండో‌‌–పసిఫిక్​లో మిలిటరీ చర్యలను సహించం
  • ఇండో‌‌–పసిఫిక్​లో మిలిటరీ చర్యలను సహించం
  • క్వాడ్ దేశాల  అధినేతల హెచ్చరిక 
  • సముద్రాల్లో డ్రాగన్ దూకుడును ఖండిస్తూ సంయుక్త ప్రకటన
  • హిరోషిమాలో మోడీ, బైడెన్, కిషిడ, ఆల్బనీస్ భేటీ

హిరోషిమా: హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో మిలిటరీ కార్యకలాపాలు చేపడుతూ తరచూ ఉద్రిక్తతలు పెంచుతున్న చైనాకు క్వాడ్ గ్రూప్ దేశాలు ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా గట్టిగా వార్నింగ్ ఇచ్చాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి భంగం కలిగిచడాన్ని సహించబోమంటూ పరోక్షంగా డ్రాగన్ కంట్రీకి తేల్చిచెప్పాయి. శనివారం జపాన్ లోని హిరోషిమా నగరంలో జీ7 సమిట్ సందర్భంగా క్వాడ్ (క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) దేశాల అధినేతలు ప్రధాని మోడీ, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సముద్ర జలాల్లో వివాదాస్పద ప్రాంతాల్లో మిలిటరీ యాక్టివిటీస్ చేస్తున్న చైనా తీరును పరోక్షంగా వ్యతిరేకిస్తూ ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ‘‘ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని అస్థిరపరిచే చర్యలను మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రాంతంలో బలవంతంగా, ఏకపక్షంగా ఎలాంటి మార్పులు చేయడాన్ని మేం అంగీకరించం” అని స్పష్టం చేశారు. వివాదాస్పద ప్రాంతాల్లో మిలిటరీ కార్యకలాపాలు చేపట్టడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలను వినియోగించడం, ఇతర దేశాల రీసెర్చ్ కార్యకలాపాలను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రాంతంలోని పేద దేశాలను ఆర్థిక ఎత్తుగడలతో లోబర్చుకుని మిలిటరీ స్థావరాలను ఏర్పర్చుకోవడాన్ని కూడా మేం వ్యతిరేకిస్తున్నాం” అని క్వాడ్ దేశాల అధినేతలు చైనాకు తేల్చిచెప్పారు. కాగా, జీ7 సమిట్ అనంతరం క్వాడ్ మీటింగ్ ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉండగా,  ప్రెసిడెంట్ బైడెన్ అకస్మాత్తుగా ఆదివారమే అమెరికా వెళ్లిపోవాల్సి రావడంతో హిరోషిమాలోనే క్వాడ్ దేశాల అధినేతలు భేటీ అయ్యారు.

సార్వభౌమత్వం కాపాడుకుంటం: మోడీ 

ఇండియా తన సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకునేందుకు కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జీ7 సమిట్ లో పాల్గొనేందుకు శుక్రవారం జపాన్ లోని హిరోషిమా చేరుకున్న ప్రధాని.. శనివారం జపనీస్ పత్రిక యోమియురి షింబన్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అనంతరం జీ7 సమిట్ లో జరిగిన కార్యక్రమంలోనూ ఆయన మాట్లాడారు. దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్రాల్లో, తైవాన్ జలసంధిలో డ్రాగన్ కంట్రీ మిలిటరీ కార్యకలాపాలతో ఉద్రిక్తతలు పెంచడంపై ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. ‘‘సార్వభౌమాధికారాన్ని ఇండియా గౌరవిస్తుంది. వివాదాలను అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా, శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉంటుంది” అని మోడీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలహీనవర్గాల ప్రజలు, చిన్న రైతులపై దృష్టి పెడుతూ ‘ఇన్ క్లూసివ్ ఫుడ్ సిస్టమ్’ను నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. ఫర్టిలైజర్ వనరులను ఆక్రమించుకుంటూ ‘విస్తరణ మనస్తత్వం’ చూపే దేశాలకు చెక్ పెట్టాలని మోడీ పిలుపునిచ్చారు.

దేశాధినేతలకు ఆత్మీయ పలకరింపు

హిరోషిమాలో ప్రధాని మోడీ, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు కౌగిలించుకుని, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని విషెస్ చెప్పుకున్నారు. వచ్చే నెల ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఉండటంతో ఇరువురు నేతలు మళ్లీ కలుసుకోనున్నారు. జీ7 సమిట్ సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఇండోనేసియా ప్రెసిడెంట్ జోకో విడొడో, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్​నూ ప్రధాని మోడీ కలిశారు. జపాన్ ప్రధాని కిషిడతో, దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్​తో, వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ తో, జర్మన్ చాన్స్ లర్ ఓలాఫ్ ష్కోల్జ్ తోనూ మోడీ సమావేశమయ్యారు. 

అణ్వాయుధరహిత ప్రపంచం కోసం..

ప్రపంచంలోనే తొలి అణుబాంబు దాడి జరిగిన హిరోషిమా నగరంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రధాని మోడీ శనివారం ఆవిష్కరించి, నివాళులు అర్పించారు. అహింస, శాంతికి సంఘీభావంగా హిరోషిమాలో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ‘‘హిరోషిమా పేరు వింటేనేటికీ ప్రపంచం వణికిపోతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం ప్రపంచానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. గాంధీ అనుసరించిన శాంతి మార్గం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది” అని మోడీ పేర్కొన్నారు. అణ్వాయుధాల వంటి వెపన్స్ ప్రయోగం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మోడీ ఈ సందర్భంగా అన్నారు. జపాన్ ప్రధాని కిషిడ ప్రతిపాదించిన ‘అణ్వాయుధాలు లేని ప్రపంచం’ కోసం అన్ని దేశాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా, రెండు దేశాల ఫ్రెండ్షిప్ కు గుర్తుగా గాంధీ విగ్రహాన్ని జపాన్ కు  ఇండియా గిఫ్ట్ గా అందజేసింది. 42 ఇంచ్ ల పొడవున్న ఈ కంచు విగ్రహాన్ని పద్మభూషణ్ రామ్ వంజీ సుతార్ రూపొందించారు.

మేం చేయగలిగింది చేస్తం
జెలెన్ స్కీకి మోడీ భరోసా 

జీ7 సమిట్ సందర్భంగా శనివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనంక తొలిసారి ఇద్దరు నేతలు కలిశారు. ‘‘ఉక్రెయిన్​లో జరుగుతున్న యుద్ధం మొత్తం ప్రపంచానికే పెద్ద సమస్యగా మారింది. దీన్ని రాజకీయ, ఆర్థిక సమస్యగానో నేను భావించడం లేదు. ఇది మానవత్వం, మానవ విలువలకు సంబంధించిన సమస్య. పోయినేడు ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మా విద్యార్థులు అక్కడి పరిస్థితులను వివరించినప్పుడు.. మీ ప్రజలు పడుతున్న కష్టాలను అర్థం చేసుకోగలిగాను. ఈ సమస్యను పరిష్కరించేందుకు మా దేశం తరఫున చేయగలిగింది చేస్తాం. నేను వ్యక్తిగతంగానూ కృషి చేస్తాను” అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.