ఇండియన్ ఎకానమీ దౌడ్​ తీస్తది

ఇండియన్ ఎకానమీ దౌడ్​ తీస్తది

ఒత్తిళ్లను ఎదుర్కొనే కెపాసిటి ఉంది
5 లక్షల కోట్ల టార్గెట్ పై ప్రధాని మోడీ ఆర్థిక నిపుణులతో ప్రి బడ్జెట్ మీట్

న్యూఢిల్లీ: ఇండియాను 5 లక్షల కోట్ల ఎకానమీగా మార్చేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆర్థికవేత్తలు, వివిధ రంగాలలో నిపుణులు, యువ ఎంట్రప్రెనూర్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. నిపుణులు ఇచ్చిన సలహాలను ప్రధాన మంత్రి మెచ్చుకున్నారు. విధానాల రూపకల్పనలో ఈ సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. విధానకర్తలు (పాలసీ మేకర్లు), స్టేక్‌‌ హోల్డర్ల మధ్య మరింత మెరుగైన సంబంధాలుండేలా చర్యలు తీసుకుంటానని మోడీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బడ్జెట్‌ ముందు వివిధ వర్గాల సూచనలు, సలహాలను తీసుకునే క్రమంలో నీతి ఆయోగ్‌ నిర్వహించిన ప్రి బడ్జెట్‌ మీటింగ్‌లో గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆర్థిక వృద్ధి మళ్లీ పుంజుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ మీటింగ్‌లో పాల్గొన్న నిపుణులు ప్రస్తావించారు.

2019–20 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి 5 శాతానికి (11 ఏళ్ల కనిష్టానికి) పడిపోతున్న నేపథ్యంలో ఈ సలహాలు, సూచనలను నిపుణులు చేశారు. 5 లక్షల కోట్ల ఎకానమీ అనేది అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన ఐడియా కాదని, దేశపు బలాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాకే దానిని నిర్ణయించుకున్నామని మోడీ పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిడులనైనా తట్టుకునే శక్తి ఇండియా ఎకానమీకి ఉందని, మళ్లీ వృద్ధి వేగం పుంజుకుంటుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. టూరిజం, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ , ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, అగ్రి బేస్డ్‌ ఇండస్ట్రీలకు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉన్నవని, ఉపాధి అవకాశాలను పెంచుతాయని అభిప్రాయపడ్డారు. మనందరం కలిసి పనిచేయాలి. ఒకే దేశంగా ఆలోచించాలని మోడీ పిలుపు ఇచ్చారు. బ్యాంకులు అప్పులు, ఎగుమతుల వృద్ధి, పీఎస్‌యూ బ్యాంకులు, వినియోగం పెంపుదల, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టాలని ఈ మీటింగ్‌లో నిపుణులు అభిప్రాయపడ్డారు. సుమారు 40 మంది నిపుణులు, ఎకానమిస్టులు గురువారం నాటి మీటింగ్‌లో పాల్గొన్నారు.