భారత్‌పైనే ప్రపంచం ఆశలు.. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తం: మోడీ

భారత్‌పైనే ప్రపంచం ఆశలు.. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తం: మోడీ

టోక్యో: ప్రపంచంలోనే భారత్ అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అందుకే ప్రపంచమంతా ఇండియాపై ఆశలు పెట్టుకున్నదని చెప్పారు. త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ, ఆర్థిక స్థిరత్వం, విధానాల్లో పారదర్శకతతో ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌కు దేశం గమ్యస్థానంగా మారిందని చెప్పారు. 

ముఖ్యంగా గ్రీన్​ఎనర్జీ, సాంకేతికత రంగాల్లో పెట్టుబడుల వరద పారుతున్నదని తెలిపారు.  రెండు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌‌కు వెళ్లిన మోదీ.. శుక్రవారం టోక్యోలో నిర్వహించిన  భారత్‌‌–-జపాన్‌‌ సంయుక్త ఆర్థిక సదస్సులో ప్రసంగించారు. ప్రపంచ వృద్ధిలో భారత్​18 శాతం వాటాను కలిగి ఉన్నదని చెప్పారు.  ‘‘భారత్‌‌లో బలమైన బ్యాంకింగ్ రంగం ఉంది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి.

విదేశీ మారక నిల్వలు దాదాపు 700 బిలియన్ డాలర్లు ఉన్నాయి” అని వెల్లడించారు. దేశంలో మూలధనం ఎన్నో రెట్లు పెరుగుతున్నదని తెలిపారు. 11 ఏండ్లలో భారత్‌‌లో గతంలో ఎన్నడూ లేనంతగా మార్పులు వచ్చాయని చెప్పారు. 80 శాతం కంపెనీలు దేశంలో విస్తరించాలని కోరుకుంటున్నాయని, ఇప్పటికే 75 శాతం కంపెనీలు లాభాల్లో ఉన్నాయని మోదీ వివరించారు.  మేకిన్‌‌ ఇండియా కోసం ఇండియాకు తరలి రావాలని.. ప్రపంచం కోసం తయారీ చేపట్టాలని వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు.

జపాన్‌‌తో కీలక పార్ట్‌‌నర్‌‌‌‌షిప్​

సెమీకండక్టర్ల పరిశ్రమల నుంచి స్టార్టప్‌‌ల వరకూ భారత్‌‌కు జపాన్‌‌ అత్యంత కీలక భాగస్వామిగా ఉన్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జపాన్‌‌ సంస్థలు భారత్‌‌లో 40 బిలియన్‌‌ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు. గత రెండేండ్లలోనే 13 బిలియన్ ​డాలర్లు ఇన్వెస్ట్​ చేశాయని వెల్లడించారు. జపాన్ ​టెక్ ​పవర్​హౌస్​ అయితే.. భారత్​ టాలెంట్​ పవర్​హౌస్​ అని అన్నారు. 

ఈ శతాబ్దపు సాంకేతిక విప్లవానికి, ముఖ్యంగా ఏఐ, సెమీ కండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్​, అంతరిక్ష రంగాల్లో రెండు దేశాలు నాయకత్వం వహించగలవని చెప్పారు. ‘‘"భారత్‌‌ 2030 నాటికి 500  గిగావాట్ల పునరుత్పాదక శక్తి వైపు వేగంగా కదులుతున్నది. 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తిని కూడా మేం లక్ష్యంగా పెట్టుకున్నం. సోలార్ సెల్స్‌‌ నుంచి  గ్రీన్ హైడ్రోజన్ వరకు జపాన్–ఇండియా భాగస్వామ్యానికి భారీ అవకాశాలు ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు.

ఇండియా–జపాన్​ మధ్య ముంబై– అహ్మదాబాద్​ హైస్పీడ్ ​రైలు ఫ్లాగ్‌‌షిప్ ప్రాజెక్టు అని మోదీ చెప్పారు. కొన్నేండ్లలోనే ప్రయాణికుల సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అలాగే, దేశంలో 7 వేల కిలో మీటర్ల హై స్పీడ్​ రైల్​ నెట్‌‌వర్క్‌‌ను కలిగి ఉండాలనే గొప్ప ఆశయంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు స్థిరంగా కొనసాగాలంటే ఎక్కువ భాగం మేకిన్​ ఇండియా ద్వారా జరగాలని కోరుకుంటున్నానని, ఈ ప్రయత్నంలో జపాన్​ కంపెనీలు చురుగ్గా పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నాని తెలిపారు.

జపాన్​మాజీ ప్రధానులతో భేటీ

జపాన్​ పర్యటనలో భాగంగా  మోదీ ఆ దేశ మాజీ ప్రధానులు యోషిహిదే సుగా, ఫ్యూమియో కిషిదతో భేటీ అయ్యారు. దైపాక్షిక సంబంధాలపై చర్చించారు. కిషిదతో అద్భుతమైన మీటింగ్​ జరిగిందని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు.

 ‘‘జపాన్​–భారత్​ మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు కిషిద మంచి సలహాలు ఇస్తారు.  వాణిజ్యం, కీలకమైన సాంకేతికతలు, మానవ వనరుల వినియోగంపై చర్చించాం.  టెక్నాలజీ,  సెమీకండక్టర్స్ లాంటి అభివృద్ధి చెందుతున్న రంగాలపై డిస్కస్ ​చేశాం” అని వివరించారు. భారత్​–జపాన్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే అంశంపై విస్తృతంగా చర్చించినట్టు చెప్పారు.

భారత్- చైనా కలిసి పనిచేయాలి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకువచ్చేందుకు భారత్​-–చైనా కలిసి పనిచేయడం ఇప్పుడు చాలా ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. పరస్పర గౌరవం, పరస్పర ఆసక్తి, పరస్పర సున్నితత్వం ఆధారంగా  ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్​సిద్ధంగా ఉన్నదని చెప్పారు. 

జపాన్‌‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అధ్యక్షుడు జి జిన్‌‌పింగ్ ఆహ్వానం మేరకు నేను ఇక్కడి నుంచి షాంఘై కోఆపరేషన్​ఆర్గనైజేషన్​ సదస్సులో పాల్గొనడానికి చైనాకు వెళ్తున్నాను. నిరుడు కజాన్‌‌లో జిన్‌‌పింగ్​తో  సమావేశంనుంచి మా ద్వైపాక్షిక సంబంధాల్లో స్థిరమైన, సానుకూల పురోగతి సాధించాం” అని చెప్పారు. 

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కానుక

ప్రధాని మోదీకి టోక్యోలోని షోరింజన్​ దారుమాజీ టెంపుల్​ ప్రధాన పూజారి సీషి హిరోసే.. దారుమా బొమ్మను కానుకగా ఇచ్చారు. ఈ బొమ్మ జపాన్​ సాంప్రదాయంలో అదృష్టాన్ని సూచించే వస్తువు. ఇది గుండ్రగా బోలు ఆకారంలో ఉంటుంది.   జెన్​ బౌద్ధ సంప్రదాయ స్థాపకుడు బోధిధర్ముడి నమూనాలో దీన్ని రూపొందించారు. ఇది కేవలం అదృష్ట చిహ్నంగానే కాకుండా దృఢ సంకల్పం, పట్టుదలను కూడా సూచిస్తుంది.