- మోడీ, అమిత్ షా లపై కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ : మూడో విడత లాక్ డౌన్ పొడిగించే నిర్ణయాన్ని ప్రకటించేందుకు ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా లకు ధైర్యం సరిపోలేదని కాంగ్రెస్ విమర్శించింది. ప్రజల ముందుకు వచ్చేందుకు వారు సిగ్గుపడ్డారని కాంగ్రెస్ మీడియా ఇంఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా అన్నారు. లాక్ డౌన్ పొడగించేందుకు కారణాలు వివరిస్తూ ప్రజలకు నచ్చజెప్పాల్సింది పోయి ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కరోనా నివారణకు కేంద్రం వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా అని ప్రశ్నించారు. లాక్ డౌన్ 4.0, లాక్ డౌన్ 5.0 కూడా ఉంటుందా లేక అంతం అనేది ఉందా చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే డేంజర్ జోన్ ఉందని… లక్షలాది మంది జాబ్ లు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మే 17 నాటికి కేంద్రం ప్లాన్స్ ఏమిటీ ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై మోడీ ప్రభుత్వానికి స్పష్టత లేదని ఫైర్ అయ్యారు. రైతులకు మద్దతు ధర, కార్మికుల భవిష్యత్ , స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీలను కాపాడేందుకు స్పెషల్ ప్యాకేజీ కేటాయించాలని సుర్జేవాలా డిమాండ్ చేశారు.
