
ఉత్తరాఖండ్ లో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును భారత ప్రధాని నరేంద్ర మోడీ మే 25 గురువారం రోజున ప్రారంభించనున్నారు. ఈ రైలును ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా పాల్గొననున్నారు. ఈ రైలు డెహ్రాడూన్, న్యూఢిల్లీ మధ్య నడవనుంది. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు అన్ని రాష్ట్రాలకు వందే భారత్ రైళ్ళను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
అంతకుముందు 2023 మే 18న పూరీ-, హౌరా మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మరోవైపు తెలంగాణకు త్వరలో మరో వందే భారత్ రైలు రానుంది. ప్రస్తుతం తెలంగాణలో రెండు వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. తొలుత సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కాగా.. ఆ తర్వాత సికింద్రాబాద్- తిరుపతి మధ్య కూడా వందే భారత్ ట్రైన్ నడుస్తోంది. వీటికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. దీంతో మరొక వందే భారత్ ట్రైన్ కోసం భారతీయ రైల్వే పని చేస్తోంది. ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ మహారాష్ట్రలోని నాగ్‌పుర్ నుంచి తెలంగాణలోని సికింద్రాబాద్ వరకు నడవనున్నట్లు సమాచారం.