న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో వరుస టెర్రర్అటాక్స్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గత నాలుగు రోజులుగా రియాసి, కథువా, దోడా జిల్లాల్లో నాలుగు చోట్ల టెర్రరిస్టులు జరిపిన దాడుల్లో తొమ్మిది మంది యాత్రికులు, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మరణించారు. ఏడుగురు భద్రతా సిబ్బందితో పాటు పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్, ఇతర సీనియర్ అధికారులతో మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రవాద నిరోధక చర్యలతో పాటు భద్రతా పరిస్థితులపై సమగ్ర రిపోర్ట్‌ను ప్రధానికి అందించారు. కాగా, జమ్మూ కాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఉగ్రవాద వ్యతిరేక కార్యకాలపాలను పెంచాలని ప్రధాని ఆదేశించారు. అలాగే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా ప్రధాని మాట్లాడారు. బలగాల మోహరింపు, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై వారితో చర్చించారు. అలాగే, జమ్మూ కాశ్మీర్ పోలీసులు దోడా జిల్లాలో రెండు చోట్ల దాడులకు పాల్పడిన నలుగురు టెర్రరిస్టులకు సంబంధించిన స్కెచ్‌లను విడుదల చేశారు. వారి ఆచూకీ చెప్తే రూ.20 లక్షల రివార్డ్ఇస్తామని కూడా ప్రకటించారు.
బస్సుపై అటాక్ కేసు.. 50 మంది అదుపులోకి..
జమ్మూ కాశ్మీర్ లోని రియాసీ జిల్లాలో ఆదివారం యాత్రికుల బస్సుపై జరిగిన టెర్రర్ దాడి కేసులో పోలీసులు 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. టెర్రర్ అటాక్స్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంమంత్రి అమిత్‌షా, ఇతర సీనియర్ అధికారులతో మాట్లాడిన కొన్ని గంటల్లోనే పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆదివారం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ కు చెందిన యాత్రికులు రియాసి జిల్లాలోని శివ ఖోరీ ఆలయం నుంచి కత్రాలోని మాతా వైష్ణో దేవి మందిరానికి వెళ్తుండగా టెర్రరిస్టులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బస్సు లోయలో పడి తొమ్మిది మంది యాత్రికులు మృతి చెందారు. మరో 41 మంది గాయపడ్డారు.
జమ్మూకాశ్మీర్‌లో బస్సు బోల్తా
ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రఫియాబాద్ ప్రాంతంలోని పజల్‌పోరా వద్ద మినీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ యాక్సిడెంట్లో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. ప్రయాణికులను తీసుకెళ్తున్న మినీ బస్సు అతివేగం కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరిని అబ్దుల్ రషీద్ ఖాన్, నూర్ మహ్మద్ జుంజుగా గుర్తించారు. ఇద్దరూ రఫియాబాద్‌లోని హమామ్ మర్ఖూట్‌కు చెందినవారని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని బారాముల్లా టౌన్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)కు తరలించినట్టు చెప్పారు.