కసితో ఆడాను.. వికెట్ తీసిన ప్రతిసారి నాన్నే గుర్తుకొచ్చారు…

కసితో ఆడాను.. వికెట్ తీసిన ప్రతిసారి నాన్నే గుర్తుకొచ్చారు…

టీమిండియా క్రికెటర్ హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్

హైదరాబాద్: ‘‘చిరకాల వాంఛ తీరే సమయంలో  టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేస్తున్నానన్న ఆనందం లేదు.. నాన్న లేడన్న బాధలో మైదానంలో దిగాను.. కసితీరా ఆడాను.. వికెట్ తీసిన ప్రతిసారి నాన్న గుర్తుకొచ్చేవాడని టీమిండియా క్రికెటర్ హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ చెప్పాడు. ఆస్ట్రేలియా టూర్ ను విజయవంతంగా ముగించుకుని సొంతింటికి వచ్చిన సందర్భంగా మహమ్మద్ మీడియా సమావేశంలో అంతరంగాన్ని ఆవిష్కరించాడు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానాలిచ్చాడు.

తొలుత హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలకడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. సంతోషం కలిగించినా.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తండ్రి సమాధి వద్దకు వెళ్లి  నివాళులర్పించాడు.. సమాధిని చూస్తూ.. కాసేపు మౌనంగా తండ్రిని గుర్తు చేసుకుని కంటతడిపెట్టుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చిన తల్లిని ఓదార్చాడు. తనకిష్టమైన వంటకాలన్నీ సిద్ధం చేసిన తల్లి ప్రేమగా తినిపిస్తుంటే.. తండ్రిని గుర్తు చేసుకుని.. కడుపునిండా ఆరగించానన్నాడు. అనంతరం శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలువగా.. ఆయన దుశ్వాలువతో సిరాజ్ ను సత్కరించారు. సిరాజ్ కు మంచి భవిష్యత్తు ఉందని.. ఇంకా బాగా ఆడి తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింప చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో సిరాజ్ మాట్లాడారు.

కొహ్లి బాగా ప్రోత్సహించి అండగా నిలిచారు

అంతర్జాతీయ క్రికెట్ లో తనను కోహ్లి బాగా ప్రోత్సహించాడని మహమ్మద్ సిరాజ్ చెప్పాడు. కెరీర్ పై టెన్షన్ గా ఉన్న సమయంలో  ఐపీఎల్ కు తనను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఎంపిక చేసుకోవడంలో కొహ్లి చొరవ చూపాడని.. మైదానంలో కూడా ఎంకరేజ్ చేయడంతో నిలదొక్కుకోగలిగానని సిరాజ్ పేర్కొన్నాడు. ఒత్తిడిని కాస్త పక్కన పెట్టు.. ఆట మీద దృష్టిపెట్టి ఆడమని భుజం తట్టి ప్రోత్సహించడం కొండంత బలాన్నిచ్చింది. టెస్టు క్రికెట్ అరంగేట్రం సమయంలో కూడా కొహ్లి చెప్పిన సూచనలు పాటించి సక్సెస్ అయ్యానని.. ఆస్ట్రేలియా టూర్ విజయవంతం కావడం చాలా సంతోషాన్నిచ్చిందని.. ఈ విజయం తన తండ్రికే అంకితమన్నాడు. తాను క్రికెట్ లో ఎంతో ఎదగాలని తన తండ్రి కలలు కనేవాడని.. తన కెరీర్ కోసం.. కుటుంబం కోసం రాత్రింబగళ్లు ఆయన కష్టం గుర్తుకొచ్చి ఆటపై మరింత లగ్నం చేసి ఆడేవాడినని సిరాజ్ చెప్పాడు.

బుమ్రా బాగా మద్దతిచ్చాడు

సీనియర్లు లేకుండా బరిలోకి దిగుతున్న భారతజట్టుపై అందరూ తక్కువగా అంచనాలు వేయడం ఒత్తిడికి గురిచేసింది. కొహ్లి సూచనలు గుర్తొకొచ్చాయి. బుమ్రా కూడా బాగా మద్దతిచ్చాడు. మరో వైపు  అజ్జూ భాయ్ కూడా (అజింక్య రహానే) మనస్పూర్తిగా ప్రోత్సహించడంతో బాగా కసి పెరిగింది. కొహ్లి భాయ్ మాదిరే అజ్జూ భాయ్ కూడా ప్రోత్సహించడంతో మైదానంలో చురుగ్గా ఉన్నాను. సీనియర్లకు తోడు మైదానంలోని ఆటగాళ్లు కూడా ప్రోత్సహించడం.. స్టేడియంలోని భారత అభిమానులు కూడా ఎంకరేజ్ చేయడంతో సత్తా చాటేందుకు కలిసొచ్చింది. వికెట్ తీసిన ప్రతిసారి నాన్నే గుర్తుకొచ్చాడు.

ఇక ముందు కూడా మీ మద్దతు కావాలి

‘‘ఆస్ట్రేలియా టూర్ ముగించుకుని ఇప్పుడే ఇంటికొచ్చా.. అలాగని రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. చాలా రోజుల తర్వాత కడుపునిండా ఇంటి భోజనం తిని ఆస్వాదించా.. సీనియర్లు తిరిగొచ్చినా.. సీనియర్లందరినీ గౌరవిస్తూ.. ఆటపై మనసు లగ్నం చేసి సాధన చేస్తాను.. భవిష్యత్తులో కూడా ఇదే ఊపు కొనసాగించాలి. దీనికి సీనియర్లే కాదు.. మీ అందరి సహకారం.. ముఖ్యంగా అభిమానుల మద్దతు అవసరం.. ’’ అని  మహమ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తండ్రి సమాధి వద్దకు..

తండ్రీ కొడుకుల వాట్సప్ చాట్.. సైబరాబాద్ పోలీసుల ట్వీట్

డ్రగ్స్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రాగిణికి బెయిల్

వైరల్ వీడియో: హలో.. నేను తేజస్వీ యాదవ్ మాట్లాడుతున్నా