Mohammed Shami: నేను ఫిట్‌గానే ఉన్నా.. మీరే నన్ను పట్టించుకోలేదు: సెలక్టర్లపై షమీ విమర్శలు

Mohammed Shami: నేను ఫిట్‌గానే ఉన్నా.. మీరే నన్ను పట్టించుకోలేదు: సెలక్టర్లపై షమీ విమర్శలు

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. అక్టోబర్ 4న  ప్రకటించిన ఈ స్క్వాడ్ లో షమీని కనీసం పరిగణించలేనట్టు సమాచారం. షమీని ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి పూర్తిగా పక్కన పెట్టిన సెలక్టర్లు ఇకపై వన్డేల్లోనూ చెక్ పెట్టబోతున్నట్టు పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. మూడు ఫార్మాట్ లలో చోటు దక్కించుకోలేకపోతున్న ఈ స్టార్ పేసర్ తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తనని ఎందుకు జట్టులో తీసుకోవట్లేదో పరోక్షంగా సెలక్టర్లకు ప్రశ్నించాడు. తాను ఫిట్ గా ఉన్నానని చెబుతూ భారత జట్టు యాజమాన్యంపై విమర్శలు గుప్పించాడు.    

ప్రస్తుతం రంజీ ట్రోఫీకి సిద్ధమవుతున్న షమీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అలాగే తాను ఫిట్ గా ఉన్నానని జిమ్ లో వ్యాయామం చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనను జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లపై విమర్శలు చేస్తూ షమీ ఇలా అన్నాడు.." భారత జట్టు సెలక్టర్లు నా ఫిట్‌నెస్ గురించి నాతో కమ్యూనికేట్ చేయలేదు. నా ఫిట్‌నెస్ గురించి వారికి తెలియజేసేది నేను కాదు. వారు నన్ను అడగాలి. నేను నాలుగు రోజుల క్రికెట్ ఆడగలిగితే, 50 ఓవర్ల వన్డే మ్యాచ్ ఎందుకు ఆడకూడదు? నేను ఫిట్‌గా లేకుంటే నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండేవాడిని కానీ రంజీ ట్రోఫీకి ఎందుకు సిద్ధమవుతాను". అని షమీ చెప్పుకొచ్చాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mohsin Khan (@mohsinkhan_80)

వెస్టిండీస్ తో ముగిసిన టెస్ట్ సిరీస్ లో షమీకి చోటు దక్కలేదు. షమీని ఎంపిక చేయకపోవడంపై అగార్కర్ మాట్లాడాడు." షమీ గురించి నాకు ఎలాంటి అప్‌డేట్ లేదు. అతను దులీప్ ట్రోఫీలో ఆడాడు. కానీ గత రెండు-మూడు సంవత్సరాలలో పెద్దగా క్రికెట్ ఆడలేదు. షమీ రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున ఒకటే మ్యాచ్.. దులీప్ ట్రోఫీలో ఒక మ్యాచ్ ఆడాడని నేను అనుకుంటున్నాను. అతను ఎలాంటి ప్లేయర్ అనే విషయం మాకు తెలుసు. అతను ఎక్కువ క్రికెట్ ఆడాలి". అని అగార్కర్ అన్నాడు. అయితే షమీ మాత్రం తనను సంప్రదించలేదని నిరాశ వ్యక్తం చేశాడు. 

వాస్తవానికి ఐపీఎల్ లో ఘోరంగా విఫలం కావడం షమీ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపించింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 9 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అప్పటికే ఫిట్‌నెస్, ఫామ్ తో ఇబ్బందిపడిన షమీకి ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఏ సిరీస్ లోనూ ఇండియా ఏ జట్టులో స్థానం దక్కలేదు. ఇటీవలే ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకొని నిరాశపరిచాడు. ఓవరాల్ గా షమీ అంతర్జాతీయ కెరీర్  ముగిసినట్టుగానే కనిపిస్తుంది. ఫామ్ లో లేని షమీని తీసుకొచ్చి ఆడించే సాహసం టీమిండియా సెలక్టర్లు చేయకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MOHAMMAD SHAMI (@mdshami.11)