National Film Awards: మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం స్వీకరణ

National Film Awards:  మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం స్వీకరణ

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విజ్ఞాన్ భవన్ లో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , కేంద్ర మంత్రి  అశ్విని వైష్ణవ్ హాజరయ్యారు. రాష్ట్రపతి  విజేతలకు స్వయంగా అవార్డులు అందజేసి గౌరవించారు. ఉత్తమ నటులుగా షారూఖ్ ఖన్, విక్రాంత్ మాస్సే.. జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ అవార్డులు అందుకున్నారు. జాతీయ ఉత్తమ చిత్రంగా 12 th ఫెయిల్‌ చిత్రానికి ఘనత దక్కింది.  2023లో ఏడాదికి గానూ విజేతలకు ఈ అవార్డులను అందించారు

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మోహన్ లాల్

ఈ సందర్భంగా మలయాళ సినిమాకు వన్నె తెచ్చిన సూపర్ స్టార్, ‘ది కంప్లీట్ యాక్టర్’ మోహన్‌లాల్ అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. ఇప్పటికే పద్మశ్రీ (2001), పద్మభూషణ్ (2019) లాంటి గౌరవాలను అందుకున్న మోహన్‌లాల్‌కు ఈ తాజా పురస్కారం ఆయన అపారమైన నటనా ప్రతిభకు, భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేష సేవలకు తగిన గుర్తింపుగా నిలిచింది.

అవార్డు అందుకున్న తర్వాత మోహన్‌లాల్ మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని యావత్ మలయాళ చిత్ర పరిశ్రమకు అంకితం చేశారు. "మలయాళ సినిమాకు భారతీయ చిత్రసీమలో ఇంతటి గౌరవం లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను నా పనిని దేవుడిచ్చిన వరంగా భావిస్తాను, అందుకే ఈ అవార్డును కూడా ఆ దేవుడే ఇచ్చాడని నమ్ముతాను. మనం మన పనిలో చూపించే నిజాయితీ కూడా దీనికి కారణం. ఈ అవార్డును అందరితో పంచుకుంటాను, ఈ ప్రయాణంలో మన మధ్య లేనివారిని కూడా గుర్తు చేసుకుంటున్నాను" అని భావోద్వేగంతో చెప్పారు.

 ఎంట్రీ నుంచి ఎప్పటికీ నటుడిగా
1980లో 'మంజిల్‌ విరింజ పూక్కళ్‌' చిత్రంతో నటుడిగా మోహన్‌లాల్ సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట్లో విలన్‌ పాత్రలతో తన కెరీర్‌ను ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ మలయాళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. దాదాపు 45 సంవత్సరాల సుదీర్ఘ నట జీవితంలో 350కి పైగా చిత్రాల్లో నటించి, ప్రతి పాత్రకు జీవం పోసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన నటనలో ఉండే సహజత్వం, పాత్రలో లీనమయ్యే పద్ధతి, అద్భుతమైన భావోద్వేగాల ప్రదర్శన ఆయనను ‘ది కంప్లీట్ యాక్టర్’గా నిలబెట్టాయి.

►ALSO READ | OTT Thriller: ఓటీటీలో అదరగొడుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్.. ఇంట్లో దెయ్యాలతో పెళ్ళైన కొత్త జంట

కేవలం మలయాళంలోనే కాకుండా, తెలుగు, తమిళం, కన్నడ, మరియు హిందీ భాషల్లో కూడా తనదైన ముద్ర వేశారు. తెలుగు ప్రేక్షకులకు ‘జనతా గ్యారేజ్’ సినిమాతో బాగా దగ్గరైన మోహన్‌లాల్, ఈ సినిమాలో ఆయన పోషించిన  పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తమిళంలో కమల్ హాసన్‌తో కలిసి నటించిన ‘ఉనాయ్ పోల్ ఒరువన్’, హిందీలో ‘కంపెనీ’ లాంటి చిత్రాలు ఆయన ప్రతిభను వేరే భాషల ప్రేక్షకులకు కూడా పరిచయం చేశాయి.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, అభిమానులు మోహన్‌లాల్‌ను అభినందనలతో ముంచెత్తారు. భారతీయ సినీ రంగంలో అత్యున్నతమైన ఈ గౌరవం, ఆయనకు దక్కడం ఆయన నట జీవితానికి, కష్టానికి తగిన గుర్తింపుగా భావిస్తున్నారు. ఈ పురస్కారం మలయాళ సినీ పరిశ్రమకు దక్కిన గౌరవంగా కూడా నిలిచిపోయింది. గతంలో ఈ అవార్డును మలయాళంలో జే.సీ.డేనియల్, అడూర్ గోపాలకృష్ణన్ లాంటి ప్రముఖులకు అందించారు.