ఫాం హౌస్ కేసు : హైకోర్టులో జగ్గుస్వామి సోదరుడి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్

ఫాం హౌస్ కేసు : హైకోర్టులో జగ్గుస్వామి సోదరుడి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్

మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో  కేరళ వైద్యుడు జగ్గు స్వామి సోదరుడు మణిలాల్ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తనకు ఈ కేసుతో సంబంధం లేదని పిటిషన్ లో మణిలాల్ పేర్కొన్నారు. దీంతో  తెలంగాణ ప్రభుత్వం, సిట్ దర్యాప్తు అధికారి(ఏసీపీ)కి  హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.  

ఫాం హౌస్ కేసుకు సంబంధించి పలువురు నిందితులు వెల్లడించిన వివరాల మేరకు.. జగ్గు స్వామిని విచారించేందుకు సిట్‌ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ బృందం ఇటీవల కేరళకు వెళ్లింది. అయితే జగ్గు స్వామి అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. దీంతో సిట్‌ అధికారులు సాక్షులైన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్‌ అసిస్టెంట్లకు 41–ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఈనేపథ్యంలోనే జగ్గు స్వామి సోదరుడు మణిలాల్ తెలంగాణ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేశారు.