సర్కార్ దవాఖాన్లలో  డబ్బు జబ్బు

సర్కార్ దవాఖాన్లలో  డబ్బు జబ్బు
  • స్కానింగ్‌‌‌‌లు, టెస్టులు చేయించుకోవాలంటే పైసలు కట్టాల్సిందే
  • సీటీ స్కాన్‌‌‌‌కు రూ.500.. ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐకి రూ.2 వేలు.. పెట్‌‌‌‌ స్కాన్‌‌‌‌కు 5 వేలు
  • సర్కారు మౌఖిక ఆదేశాలతోనే చార్జీల వసూళ్లు
  • త్వరలో ఇతర దవాఖాన్లకు విస్తరించే యోచన?

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో పేదలకు ఉచితంగా అందాల్సిన సర్వీసులు పెయిడ్‌‌‌‌గా మారిపోతున్నాయి. స్కానింగ్స్, బ్లడ్ టెస్టులకు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం షురువైంది. సీటీ స్కాన్‌‌‌‌కు రూ.500, ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ స్కాన్‌‌‌‌కు రూ.2 వేలు, పెట్ స్కాన్‌‌‌‌కు రూ.5 వేలు చార్జ్ చేస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌లోని ఎంఎన్‌‌‌‌జే కేన్సర్ హాస్పిటల్‌‌‌‌లో ఎప్పట్నుంచో డబ్బులు వసూలు చేస్తుండగా.. తాజాగా కోఠిలోని ఈఎన్‌‌‌‌టీ హాస్పిటల్‌‌‌‌, ఎర్రగడ్డలోని చెస్ట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లోనూ ప్రారంభించారు. సీటీ స్కాన్‌‌‌‌ కోసం ఒక్కో పేషెంట్ వద్ద రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదేంటని ఎవరైనా అడిగితే ‘స్కానింగ్ కావాలంటే పైసలు కట్టాల్సిందే” అని తేల్చిచెబుతున్నారు. డబ్బులు కట్టినట్టు రిసిప్ట్ ఇవ్వాలని అడిగితే హాస్పిటల్ డెవలప్‌‌‌‌మెంట్ కోసం డొనేషన్ ఇచ్చినట్టు డోనర్ రిజిస్ర్టేషన్ పేరిట ఓ స్లిప్ ఇస్తున్నారు. డొనేషన్‌‌‌‌ ఏంటని, స్కానింగ్ కోసం డబ్బులు కట్టినట్టు బిల్లు ఇవ్వాలని అడిగితే దబాయించి పంపిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఉన్న మౌఖిక ఆదేశాలు, అనుమతుల మేరకే చార్జీలు వసూలు చేస్తున్నామని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ వసూళ్ల పర్వం ఈ మూడు దవాఖాన్లకే పరిమితం అవుతుందా, అన్ని దవాఖాన్లకూ విస్తరిస్తారా అనేదానిపై తమకు క్లారిటీ లేదంటున్నారు. ఈ వసూళ్లపై పేషెంట్ల నుంచి వ్యతిరేకత తక్కువగా ఉందని, ఇతర దవాఖాన్లకూ విస్తరించే చాన్స్ ఉందని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారు.

ఎంఎన్‌‌‌‌జేలో.. రీఫండ్ చేస్తామంటూ..
రాష్ట్రంలో కేన్సర్‌‌‌‌ రోగులకు ట్రీట్‌‌‌‌మెంట్ అందించేందుకు ఉన్న ఏకైక సర్కార్ దవాఖాన ఎంఎన్‌‌‌‌జే. మూడేండ్ల క్రితం ఇక్కడ చార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు రాగానే పేషెంట్లకు రీఫండ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. కానీ ఎవరికీ పైసా రీఫండ్ చేయడం లేదు. మరోవైపు రూ.500తో మొదలైన చార్జీలు ఇప్పుడు వేలల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు సీటీ స్కాన్‌‌‌‌కు రూ.500 నుంచి 800ల దాకా వసూలు చేస్తున్నారు. ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐకి రూ.2 వేలు, పెట్‌‌‌‌ స్కాన్‌‌‌‌కు రూ.5 వేలు చార్జ్‌‌‌‌ చేస్తున్నారు. ఒకవేళ గాంధీ, ఉస్మానియా వంటి ఇతర దవాఖాన్ల నుంచి రిఫరల్‌‌‌‌పై వచ్చే పేషెంట్లకైతే ఇంకో రూ.వెయ్యి ఎక్కువే చార్జ్ చేస్తున్నారు. ఇదే విషయమై అక్కడి ఓ ఉన్నతాధికారిని ప్రశ్నించగా..  హాస్పిటల్‌‌‌‌ కెపాసిటీకి మించి రోగులు వస్తున్నారని, ఏదైనా పరికరం రిపేర్‌‌‌‌‌‌‌‌కు వస్తే ప్రభుత్వం దాన్ని నెలల తరబడి బాగు చేయించకపోవడంతో రోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగులను టెస్టుల కోసం ప్రైవేటు హాస్పిటళ్లకు పంపాల్సి వస్తోందన్నారు. దీనివల్ల పేషెంట్లకు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతోందని, దానికంటే ఎంతో కొంత తాము చార్జ్ చేయడమే రోగులకు మంచిదన్నారు. ఇలా వసూలు చేసే డబ్బులతో రిపేర్లు చేయించుకుంటున్నామని, ఫిల్మ్‌‌‌‌లు, ఇతర రీఏజెంట్స్ కొనుగోలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ అనుమతితోనే తాము ఈ చార్జీలు తీసుకుంటున్నామని ఆ ఆఫీసర్ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఈ చార్జీల వసూలు ఆపేస్తే అది రోగులకే నష్టం తప్పితే, తమకేమీ నష్టం ఉండదన్నారు.

ఈఎన్‌‌‌‌టీలో.. బ్లడ్‌‌‌‌ టెస్టులకూ డబ్బులే
ఈఎన్‌‌‌‌టీ హాస్పిటల్‌‌‌‌లో బ్లడ్‌‌‌‌ టెస్టులకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇక్కడ టెస్టులు చేయడానికి ఎక్విప్‌‌‌‌మెంట్ లేదని, అందుకే బ్లడ్ శాంపిళ్లను ఐపీఎం(ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌‌‌‌) ల్యాబ్‌‌‌‌కు పంపించి టెస్టులు చేయిస్తున్నామని బదులిస్తున్నారు. అయితే ఐపీఎం కూడా ప్రభుత్వ సంస్థే కావడం గమనార్హం. ఒక్కో పేషెంట్ వద్ద బ్లడ్ టెస్టుల కోసం రూ.500 చార్జ్ చేస్తున్నారు. పేషెంట్ల వద్ద డబ్బులు కట్టించుకునేందుకు, బ్లడ్ శాంపిళ్లు కలెక్ట్ చేసుకునేందుకు ఐపీఎంకు చెందిన ఇద్దరు ఉద్యోగుల్ని ప్రత్యేకంగా ఈఎన్‌‌‌‌టీ హాస్పిటల్‌‌‌‌లో పనిచేయిస్తున్నారు. ఈఎన్‌‌‌‌టీకి ప్రతి రోజూ కనీసం 500 మంది వస్తుంటారు. ఇక్కడ ఒకట్రెండు నెలల్లో పేషెంట్ల వద్ద వసూలు చేసే డబ్బులతో, బ్లడ్‌‌‌‌ టెస్టులకు సంబంధించిన ఎక్విప్‌‌‌‌మెంట్ మొత్తం కొనేయొచ్చు. కానీ ఆ అంశంపై దృష్టి పెట్టకుండా పేషెంట్ల వద్ద చార్జీల వసూలుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ అంశంపై వివరణ కోరేందుకు ఈఎన్‌‌‌‌టీ సూపరింటెండెంట్‌‌‌‌ను సంప్రదించగా రెస్పాండ్‌‌‌‌ కాలేదు.