కేసీఆర్​ సభకు వచ్చినవాళ్లకు పైసల పంపిణీ

కేసీఆర్​ సభకు వచ్చినవాళ్లకు  పైసల పంపిణీ
  • కేసీఆర్​ సభకు వచ్చినవాళ్లకు  పైసల పంపిణీ
  • సిరిసిల్లలో బహిరంగంగా పంచిన సర్పంచులు, కౌన్సిలర్లు 

సిరిసిల్ల టౌన్​, వెలుగు : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ కోసం వచ్చిన జనాలకు బహిరంగంగా డబ్బులు పంచారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన కేసీఆర్ సభకు​ సిరిసిల్ల టౌన్​తో పాటు తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, వేములవాడ, బోయినపల్లి, ముస్తాబాద్​, గంభీరావుపేట తదితర మండలాల నుంచి 20 వేల మంది దాకా జనాన్ని తరలించారు. పబ్లిక్​ను తరలించే బాధ్యతను పట్టణంలో కౌన్సిలర్లకు, గ్రామాల్లో సర్పంచులు, ఇతర లీడర్లకు అప్పగించారు. జనాల తరలింపు కోసం సోమవారమే ఆయా లీడర్లకు భారీ మొత్తంలో పార్టీ ఫండ్​ చేరవేసినట్లు తెలిసింది. 

ఈ క్రమంలో సభ ముగిశాక మహిళలు బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందు బారులు తీరారు. టౌన్​ నుంచి వచ్చినవాళ్లకు  ఒక్కొక్కరికి రూ.200, మండలాల నుంచి వచ్చినవారికి రూ.500 చొప్పున  లీడర్లు బహిరంగంగా పంచారు. పలువురు అధికార పార్టీ కౌన్సిలర్లు, సర్పంచులు.. జనాలకు ఉదయం రాసిచ్చిన చీటీలు తీసుకుంటూ రూ.200, రూ.500 నోట్లను చేతిలో పెడ్తున్న వీడియోలు సాయంత్రం సోషల్​మీడియాలో తిరిగాయి. తాను నియోజకవర్గంలో ప్రజలకు పైసలు, మందుబాటిళ్లు పంచనని చెప్పిన కేటీఆర్​ఇలాకాలో ఇలా బహిరంగంగా బీఆర్ఎస్​ లీడర్లు సభకు వచ్చిన జనానికి పైసలు పంచడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.