
సైబర్ క్రిమినల్స్ నయా దందా
పోలీసుల పేర్లు, ఫొటోలతో ఫేక్ సోషల్ అకౌంట్లు
సవాల్ గా మారుతున్న సైబర్ క్రైమ్ కేసులు
నిందితులను పట్టుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్లతో నిఘా
హైదరాబాద్, వెలుగు: సైబర్ క్రైమ్స్ పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి. ఫేక్ సిమ్ కార్డులు, ఫేక్ అకౌంట్లతో మోసాలు చేస్తుండడంతో వారిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. ఇన్నాళ్లు ఫేక్ కాల్స్, లాటరీ మోసాలకు పాల్పడ్డ క్రిమినల్స్ ఇప్పుడు ఏకంగా పోలీసుల పేరుతో మనీ రిక్వెస్టులు పంపి డబ్బులు వసూలు చేస్తుండడంతో డిపార్ట్‌మెంట్ అలర్ట్ అయ్యింది. ఈ సైబర్ క్రిమినల్స్‌ను పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఫేక్ సిమ్ కార్డులు, ఫేక్ అకౌంట్లతో మోసగిస్తున్న మూడు గ్యాంగ్‌లను రాజస్థాన్‌లోని భరత్‌పూర్, ఆళ్వార్ ల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ఫేక్ సిమ్ కార్డులు, అకౌంట్లు
తెలంగాణ, ఏపీలో 100 మందికిపైగా పోలీసుల వివరాలు సేకరించినట్లు సమాచారం. రాజస్థాన్ లోని భరత్‌పూర్, అల్వార్ ఏరియాలు సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారాయి. ఈ ఏరియాల్లో సుమారు 300 గ్రామాల్లో సైబర్ మోసాలనే వృత్తిగా చేసుకున్న వారు చాలా మంది ఉన్నట్లు గుర్తించారు. భరత్‌పూర్‌లో ఒక్కో క్రిమినల్ ఇంట్లో 100 నుంచి 200 వరకు సిమ్ కార్డులు ఉన్నాయని ఎంక్వైరీలో తేలింది. ఏజెంట్స్‌తో కలెక్ట్ చేసిన నకిలీ ఆధార్ కార్డుల ద్వారా సిమ్ కార్డులు తీసుకుంటున్నారని, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారని గుర్తించారు. దీంతో సైబర్ క్రిమినల్స్ వాడే ఫోన్ నంబర్స్ డేటా కోసం సర్వీస్ ప్రొవైడర్లను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోతోంది. యూపీ,ఒడిశాల్లో కూడా కొన్ని గ్యాంగుల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్తున్నారు.
చీట్ చేయడం.. సిమ్ విరగ్గొట్టడం
ఒక్కో సిమ్ కార్డుతో సుమారు 50 మందిని టార్గెట్ చేసి ఆ తర్వాత వాటిని విరగ్గొడుతున్నారు. ఇలా ఒక్కో గ్యాంగ్ ఏటా 15,000 కు పైగా ఫేక్ ఫోన్ నంబర్స్‌తో మోసాలకు పాల్పడుతోంది. ఇలాంటి కేసుల్లో ‘‘డైరెక్టర్ ఆఫ్ టెలికాం కమ్యూనికేషన్స్”తో కలిసి పోలీసులు ఫోన్ నంబర్ల ఇన్‌ఫర్మేషన్ సేకరిస్తున్నారు. ఫోన్ నంబర్స్, టవర్ లొకేషన్ ఆధారంగా సైబర్ నేరస్తులు ఉన్న ఏరియాలను గుర్తిస్తున్నారు.
పోలీసుల సైబర్ సేఫ్టీ
డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్స్‌తో పాటు పర్సనల్‌గా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లు, ప్రొఫైల్స్ సైబర్ సెక్యూరిటీపై పోలీసులు ఫోకస్ చేశారు. తమ పేరుపై క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్లను ట్రేస్ స్తున్నారు. యూనిఫాంతో ఉన్న ఫొటోలు, ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోలను తీసేస్తున్నారు. సోషల్ మీడియాలో పోలీసుల పేరుతో సర్క్యులేట్ చేస్తున్న మనీ రిక్వెస్ట్ పోస్టులపై ఫోకస్ చేస్తున్నారు. తమ ఫొటో డీపీలతో వచ్చే పోస్టింగ్స్‌ను యాక్సెప్ట్ చెయ్యవద్దని ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కు చెబుతున్నరు.
పోయిన మనీ రికవరీ కష్టమే..
రాజస్థాన్‌లోని భరత్‌పూర్, అళ్వార్ ఏరియాల్లో వందల గ్రామాల్లో సైబర్ గ్యాంగ్స్ ఉన్నాయి. ఒక్కో ఇంట్లో వందల సంఖ్యలో సిమ్ కార్డ్స్ ఉంటాయి. 13 ఏండ్ల పిల్లల నుంచే సైబర్ క్రైమ్స్‌కు పాల్పడుతున్నారు. ఆ ఏరియాల్లో స్థానికుల నుంచి పోలీసులకు ఎలాంటి హెల్ప్ లభించదు. టవర్ లొకేషన్, ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్‌తో కొంతమంది సైబర్ క్రిమినల్స్‌ను పట్టుకుంటున్నాం. ఇలాంటి కేసుల్లో బాధితులు పొగొట్టుకున్న డబ్బు రికవరీ కావడం కష్టం. ప్రజలు మనీ రిక్వెస్టు పోస్టులపై అప్రమత్తంగా ఉండాలి.
‑ రవీందర్,ఇన్‌స్పెక్టర్, సైబరాబాద్ , సైబర్‌క్రైమ్
For More News..