
- రాష్ట్రంలో కోతులు, కుక్కల బెడదను నివారించాలి
- మండలిలో ఎమ్మెల్సీలుజీవన్ రెడ్డి, బల్మూరి వెంకట్,తీన్మార్ మల్లన్న, నర్సిరెడ్డి
- కోతుల పునరుత్పత్తినిఆపటమే సొల్యూషన్
- జిల్లా కోస్టెరిలైజేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కోతులు, కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కోతులు పంటలను దక్కనివ్వడంలేదని, కుక్కల కుక్కల బెడద వల్ల చిన్నారులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. కొన్ని చోట్ల 90 శాతం పంట కోతుల పాలు అయిపోతోందని, ప్రభుత్వ రాయితీ ఫలాలు రైతులకు చేరాలంటే కోతుల సమస్యను నివారించాలని కోరారు.
బుధవారం శాసన మండలిలో స్పెషల్ పిటిషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు. పిచ్చి కుక్కలను చంపడానికి జంతువధ నిషేధ చట్టం అడ్డురాదని తెలిపారు. ఆంజనేయ స్వామి స్వరూపంగా భావించే కోతుల విషయంలో ప్రత్యామ్నాయంగా స్టెరిలైజేషన్ చేసి పునరుత్పత్తిని ఆపాలని సూచించారు. హిమాచల్ ప్రదేశ్‌లో కోతుల నివారణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో మాత్రమే స్టెరిలైజేషన్ సెంటర్ ఉందని, మొదటి విడతగా అన్ని జిల్లాల్లో ఒక్కో స్టెరిలైజేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. స్టెరిలైజేషన్ అయిన కోతులకు గుర్తులను వేయాలన్నారు. అంతకుముందు సభలో ఎమ్మెల్సీ రవీందర్ రావు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. దీనికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు.
జీవో 46, 317 సమస్యలు పరిష్కరించాలి: బల్మూరి వెంకట్
గత పదేళ్లలో జాబ్ రిక్రూట్ మెంట్ల విషయంలో జరిగిన అనేక తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సరిచేసిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. దానితోపాటు జీవో 46, 317 ఇష్యూస్ ని కూడా పరిష్కరించి యువకులకు, నిరుద్యోగులకు అండగా నిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2008 డీఎస్సీ ఇష్యూ కూడా పెండింగ్‌లో ఉందని, త్వరగా పరిష్కరించాలని కోరారు. జాబ్ క్యాలెండర్ లో పీఈటీ పోస్టులూ ఉండేలా చూడాలన్నారు.
ప్రభుత్వ అధీనంలోకి ఎయిడెడ్ విద్యాసంస్థలు: నర్సిరెడ్డి
రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని నిర్వహించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. 20 ఏండ్ల నుంచి ఉపాధ్యాయ నియామకాలు చేయక సగం ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిర్వహిస్తేనే బాగుంటుందన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలి: తీన్మార్ మల్లన్న
మైనారిటీ రెసిడెన్షియల్, స్కూళ్లు, కాలేజీలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అర్ధంతరంగా తీసేశారని, రోస్టర్ పాయింట్లు, సూపర్ న్యూమరికల్ పోస్టులు క్రియేట్చేసైనా వాళ్లకు న్యాయం చేయాలని తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని కోరారు. వాళ్లతో 8 ఏండ్లు పని చేయించుకుని వదిలేశారని.. దీంతో 3 వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. అలాగే ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని, క్రీడా రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ద్రవ్య వినిమయ బిల్లుకు మండలి ఆమోదం
హైదరాబాద్, వెలుగు: శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.శాసనసభలో బిల్లు ఆమోదం పొందిన తరువాత బుధవారం సాయంత్రం 4:10 గంటలకు మండలిలో ప్రవేశపెట్టారు. అదే సమయంలో అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర మహిళా సభ్యులపై తలెత్తిన అంశంపై మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని చైర్మన్‌ను మండలి సభ్యులు వాణిదేవి, మధుసూధనాచారి విజ్ఞప్తి చేశారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.
తమకు మాట్లాడేందుకు అవకాశం వస్తుందని సభ్యులు కూడా భావించారు. కానీ బిల్లు ప్రవేశపెట్టడం,ఆమోదం పొందడం ఆ వెంటనే మండలి సమావేశాలు వాయిదా పడడం జరిగిపోయాయి. ఈక్రమంలో ఎలాంటి చర్చ లేకుండానే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందినట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.