250 కుక్కలను వెంటాడి.. వేటాడి..

250 కుక్కలను వెంటాడి.. వేటాడి..

పాములు పగబట్టడం గురించి విన్నాం. కానీ కోతుల పగ గురించి ఎప్పుడైనా విన్నారా? మహారాష్ట్ర బీడ్ జిల్లాలో కుక్కలపై పగబట్టిన కోతులు వాటి నామరూపాల్లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాయి. ఇంతకీ కోతులు కుక్కలపై ఎందుకు పగబట్టాయి? ఒక్కొక్కటిగా వాటిని చంపుతూ గ్రామంలో కుక్కలు కనిపించకుండా ఎందుకు చేశాయి? 

మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని మాజల్ గావ్ గ్రామం. నెల రోజుల క్రితం వరకు ఊరిలో ఎటు చూసినా గ్రామసింహాలు కనిపించేవి. కానీ ఈ మధ్య కుక్కలు కనిపించకపోవడంతో గ్రామస్థులకు ఏం జరిగిందో అర్థం కాలేదు. నిఘా వేయడంతో అసలు విషయం తెలిసింది. ఊరిలో ఉన్న కుక్కలన్నింటినీ కోతులు చంపుతున్నట్లు స్థానికులు గుర్తించారు. అందుకు కారణమేంటని ఆరా తీయగా.. కుక్కలు చేసిన ఓ పని వాటి చావుకొచ్చిందని తెలిసింది.

కొన్నాళ్ల క్రితం గ్రామంలో ఓ కోతి పిల్లను కుక్కలు వెంటాడి చంపేశాయి. ఈ ఘటన చూసి చలించిపోయిన కోతులు.. కుక్కలపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఊరిలో కుక్క కనిపిస్తే చాలు వాటిని పట్టుకుని ఏ చెట్టుపైకో, ఎత్తైన బిల్డింగ్ మీదకో తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేస్తున్నాయి. దీంతో శునకాలు తీవ్రగాయాలపాలై చనిపోతున్నాయి. ఇలా ఇప్పటి వరకు వానరాలు 250 కుక్కలను మట్టుబెట్టాయి. కోతుల పగ కారణంగా ప్రస్తుతం ఊరిలో ఒక్క కుక్క కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం శునకాలు కనిపించకపోవడంతో వానరాలు చిన్నపిల్లలను టార్గెట్ చేశాయి. అప్రమత్తమైన గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి వాటిని గ్రామం నుంచి తరిమే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలివిమీరిన కోతులు మాత్రం ముప్పుతిప్పలు పెడుతూ వారికి చిక్కకుండా పారిపోతున్నాయి.