నైరుతి ఇంకా లేట్‌!

నైరుతి ఇంకా లేట్‌!

 

  • 5 రోజులు ఆలస్యంగా రాష్ట్రానికి
  • అరేబియాలోని తుఫాను వల్లే
  • కేరళ, ముంబైల్లో భారీ వర్షాలు
  • గుజరాత్‌కు ‘వాయు’ గండం
  • యూపీలో నలుగురి దుర్మరణం
  • ఎండదెబ్బకు రైల్లోనే కన్నుమూశారు

రాష్ట్రానికి నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా రుతుపవనాలు నాలుగైదు రోజులు లేట్‌ అవొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా జూన్‌ 1న కేరళకు రావాల్సిన మాన్‌సూన్స్‌ ఈసారి జూన్‌ 6న తాకుతాయని అంచనా వేశారు. కానీ రెండ్రోజులు ఆలస్యంగా 8న వచ్చాయి. ఈ లెక్కన13న రాష్ట్రాన్ని తాకొచ్చని మొదట ఐఎండీ అంచనా వేసింది.  15 వరకు రాష్ట్రమంతా విస్తరిస్తాయని తెలిపింది. కానీ నైరుతి రాకకు మరో నాలుగైదు రోజులు వేచి చూడక తప్పదని వాతావరణ కేంద్రం తెలిపింది. అప్పటివరకు ఎండ వేడిమి తగ్గదని పేర్కొంది.

రామగుండంలో 44  డిగ్రీలు

ఈశాన్య బంగాళాఖాతంలో 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని వల్ల బుధ, గురువారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడ్రోజులు ఉత్తర, తూర్పు తెలంగాణల్లో కొన్ని చోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందంది. మరోవైపు మంగళవారం అత్యధికంగా రామగుండంలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 43.7, మెదక్‌లో 42.2, నిజామాబాద్‌లో 41.9, హన్మకొండలో 41.5 డిగ్రీలు రికార్డయింది.

కేరళలో 16 వరకు వర్షాలే

భానుడి దెబ్బకు ఉత్తరాది విలవిల్లాడుతోంది. రాజస్థాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, విదర్భ ప్రాంతాల్లో వడగాడ్పులు భయపెడుతున్నాయి. మరో 48 గంటలు వేడి ఇలాగే కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం 48 డిగ్రీలు తాకిన ఢిల్లీ మాత్రం చల్లబడింది. మంగళవారం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉత్తరాదిన ఎండ సుర్రుమంటుంటే దక్షిణాదిలో మాత్రం వర్షాలు దంచి కొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన మూడ్రోజులకే కేరళ, ముంబైల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి. కేరళ ఎర్నాకులం జిల్లాలోని పిరవంలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలప్పుజ, చెర్తల, నెడుమంగడ్‌లలో 11 సెంటీమీటర్లు పడింది. కేరళ వ్యాప్తంగా జూన్‌ 16 వరకు 7 నుంచి 11 సెం.మీ. వర్షం కురవొచ్చని వాతావరణం కేంద్రం తెలిపింది. భారీ వర్షాలకు కేరళలో ముగ్గురు మృతి చెందారు. ముంబైలో సోమ‌వారం రాత్రి నుంచి మంగ‌ళ‌వారం ఉద‌యం వ‌ర‌కూ ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురిసింది. మేఘాలు కమ్ముకోవడంతో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 11 విమానాలను దారి మళ్లించారు.

13న గుజరాత్‌కు ‘వాయు’

అరేబియా సముద్రంలో రెండ్రోజులుగా కొనసాగుతున్న వాయుగుండం తుఫానుగా (సైక్లోన్‌ వాయు) మారిందని, గుజరాత్‌ తీరాన్ని జూన్‌ 13న తాకొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, జూన్‌ 13న తెల్లవారుజామున 135 కిలోమీటర్ల వేగంతో గుజరాత్‌ తీరాన్ని తాకుతాయని వివరించింది. జూన్‌ 13, 14 తేదీల్లో సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ‘వాయు’ తుఫానుపై ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమీక్ష నిర్వహించారు. తక్షణ చర్యలపై ఆరా తీశారు.

చైనాలో వర్ష బీభత్సం.. 16 మంది మృతి

చైనాలోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి సదరన్‌ చైనాలో 16 మంది చనిపోయారని అధికారులు చెప్పారు