హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అమెరికా వర్సిటీ క్యాంపస్.. టీజీసీహెచ్ఈ చైర్మన్‌‌‌‌‌‌‌‌తో మాంట్‌‌‌‌‌‌‌‌క్లేర్ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అమెరికా వర్సిటీ క్యాంపస్.. టీజీసీహెచ్ఈ చైర్మన్‌‌‌‌‌‌‌‌తో మాంట్‌‌‌‌‌‌‌‌క్లేర్ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్, వెలుగు: అమెరికాకు చెందిన ప్రముఖ ‘మాంట్‌‌‌‌‌‌‌‌క్లేర్ స్టేట్ యూనివర్సిటీ’ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో తన శాటిలైట్ క్యాంపస్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఆ వర్సిటీ ప్రతినిధులు సోమవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డితో సమావేశయ్యారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌నేషనల్ ఎడ్యుకేషన్  సహకారంపై కీలక చర్చలు జరిపారు. సమావేశంలో భాగంగా నానో టెక్నాలజీ, డిజిటల్ లెర్నింగ్, ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌షిప్ వంటి రంగాల్లో కలిసి పనిచేసే అంశాలపై ఇరు వర్గాలు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చాయి. 

విద్యార్థుల కోసం సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, షార్ట్ టర్మ్ స్టడీ టూర్లు, ఫ్యాకల్టీ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో సిలబస్ ప్రక్షాళన, ఇండస్ట్రీ–విద్యాసంస్థల అనుసంధానానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను బాలకిష్టారెడ్డి వారికి వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మారుతున్న అవసరాలను తీర్చేందుకు మన యువత ఎంతో ఉపయోగపడుతుందని, మన స్టూడెంట్లు గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో రాణించాలంటే విదేశీ వర్సిటీలతో విద్యా భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ భేటీలో మాంట్‌‌‌‌‌‌‌‌క్లేర్ వర్సిటీ వైస్ ప్రొవోస్ట్ డాక్టర్ టేకో సుజుకి, గ్లోబల్ ఎంగేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టియానా కునిజ్కా పాల్గొన్నారు.