
త్వరలోనే సర్కారుకు ప్రపోజల్స్
హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూల్ టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియలో కీలక నిర్ణయం తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు భావిస్తున్నారు. ఏటా, రెండేండ్లకోసారి కాకుండా ప్రతి నెలా ఈ ప్రక్రియను కొనసాగించాలని యోచిస్తున్నారు. ఉన్నతాధికారులతో చర్చించి, త్వరలోనే సర్కారుకు ఈ ప్రపోజల్స్ పంపించాలని డిసైడ్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.11 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2015లో తొలిసారి టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చారు. ఆ తర్వాత 2023లో మరోసారి పదోన్నతుల ప్రక్రియ నిర్వహించారు. తాజాగా గత నెలలో ఇంకోసారి ఇచ్చారు. ఈ లెక్కన 12 ఏండ్ల కాలంలో మూడు సార్లు మాత్రమే టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయి. కోర్టు కేసుల నేపథ్యంలో ఎనిమిదేండ్ల పాటు టీచర్లకు ప్రమోషన్లు రాలేదు. దీంతో చాలామంది సీనియర్ టీచర్లు ప్రమోషన్లు పొందకుండానే, రిటైర్డ్ కావాల్సి వచ్చింది.
ఇది సర్కారుకూ చెడ్డపేరు తీసుకొస్తోంది. ఏండ్ల తరబడి ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో ఒకేసారి భారీ సంఖ్యలో టీచర్లకు పదోన్నతులు ఇవ్వాల్సి వస్తోంది. ఈ క్రమంలో సీనియార్టీ ఇష్యూలు, నిబంధనల్లో మార్పులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతి నెలా ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారు. జిల్లాల వారీగా ఈ ప్రక్రియ ఉండటంతో, తక్కువ మందే ఉండే అవకాశం ఉంటుంది. దీంతో సమస్యలు రావని యోచిస్తున్నారు. మరోపక్క ఒక నెలలో రిటైర్డ్ అయితే, ఆ తర్వాతి నెలలో ఆ పోస్టు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
దీంతో పారదర్శకత పెరగడంతో పాటు విద్యార్థులకూ టీచర్ల కొరత లేకుండా ఇబ్బందులు తప్పే చాన్స్ ఉంది. గతంలో ప్రతి నెలా టీచర్లకు ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించే వారు. తర్వాత ఆ ప్రక్రియ మారిపోయింది. మళ్లీ పాత విధానం అమలు చేయాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు, టీచర్ల సంఘాలతో చర్చించి, నెలనెలా ప్రమోషన్ల ప్రక్రియపై సర్కారుకు ప్రతిపాదనలు పంపించాలని డిసైడ్ అయ్యారు.