- రూ.54 కోట్లతో కడుతున్న సర్కారు
- 220 మీటర్ల పొడవు, 29.5 మీటర్ల వెడల్పుతో నిర్మాణం
- 8 నెలలుగా నిలిచిన రాకపోకలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి పనులు దాదాపు పూర్తయ్యాయి. 70 శాతం పనులు కంప్లీట్కాగా, వర్షాలు పడేలోపు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. జూన్నెలాఖరులోపే బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆరు లేన్లతో 220 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. రెండు వైపులా 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లను కూడా కడుతున్నారు. ముందుగా ఒక పక్కన మూడులేన్లతో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీనికి రూ.52 కోట్లు ఖర్చు పెట్టనున్నారు.
భారీ వర్షాలు వస్తే బందే...
భారీ వర్షాలు, వరదలు వచ్చినా ప్రతిసారి ముసారంబాగ్పాత బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగేది. లో-లెవెల్ కాజ్‌వే కావడంతో మూసీకి వరదలు వచ్చినప్పుడల్లా ప్రతిసారి నీళ్లు పైనుంచి ప్రవహించేవి. దీనివల్ల వర్షాకాలంలో అనేకసార్లు రాకపోకలు ఆపేయాల్సి వచ్చేది. 2020 లో వరదలు వచ్చినప్పుడు అప్పటి బీఆర్ఎస్కొత్త బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చింది.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తినప్పుడు కూడా వరద వస్తే కొత్త బ్రిడ్జి ప్రస్తావన వచ్చేది. కానీ, అప్పటి సర్కారు సీరియస్‌గా తీసుకోలేదు. 2023 జులైలో జంటజలాశయాల గేట్లు ఎత్తినప్పుడు మూసారాంబాగ్ బ్రిడ్జి బంద్ చేసి 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని అప్పట్లో మంత్రులు ప్రకటించారు. బ్రిడ్జి కోసం టెండర్లు పూర్తయినా పనులు మొదలుపెట్టలేదు.
కాంగ్రెస్ సర్కారు వచ్చాక..
గతేడాది కూడా భారీ వర్షాలు, మూసీకి వరదతో బ్రిడ్జిపై నుంచి నీళ్లు ప్రవహించడంతో రాకపోకలు బంద్‌చేశారు. దీంతో స్పందించిన సర్కారు బ్రిడ్జి ధృడత్వం తేల్చాలని ఇంజినీరింగ్నిపుణులను నియమించింది. వారి పరిశీలనలో శిథిలావస్థకు చేరిందని, వరదల కారణంగా పిల్లర్లు, జాయింట్లు బలహీనపడ్డాయని సురక్షితం కాదని తేల్చారు. దీంతో గత అక్టోబర్‌లో బ్రిడ్జిని కూల్చి పనులు మొదలుపెట్టారు. అప్పటి నుంచి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు వెళ్తున్నారు. కొత్త బ్రిడ్జి పనులు కూడా స్పీడ్‌గా సాగుతుండడంతో వచ్చే నెల నుంచే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల అంబర్‌పేట, దిల్సుఖ్నగర్ ప్రాంతాలకు మూసారంబాగ్ మీదుగా ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి.
