పని మనిషికి చిత్ర హింసల కేసులో మరో ట్విస్ట్

పని మనిషికి చిత్ర హింసల కేసులో మరో ట్విస్ట్

జార్ఖండ్ లో ఇటీవల ఓ మనిషిని చిత్ర హింసలు పెట్టిన ఘటనలో బీజేపీ నుంచి సస్పెండ్ చేయబడ్డ సీమా పాత్రా కేసులో తాజాగా ఓ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమెను పోలీసులను పట్టించింది స్వయానా ఆమె కుమారుడేనని తెలుస్తోంది. తన ఇంట్లో పనిచేసే సునీత అనే మహిళను తన తల్లి అలా చిత్ర హింసలకు గురిచేయడాన్ని చూసి చలించిపోయిన ఆ తనయుడు తన స్నేహితుడైన వివేక్ ఆనంద్ బాస్కీ అనే ప్రభుత్వాధికారికి చెప్పి సునీతకు సాయం చేయాలని కోరారట. అదే సమయంలో ఆయుష్మాన్ తల్లి కూడా ఫోన్ చేసి, తన కొడుకు ఆయుష్మాన్ మానసిక స్థితి సరిగా లేదని, హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాడని వివేక్ కు చెప్పిందట. అంతే కాదు మీరు ఏదో ఒకటి చేయాలని కోరిందట. దీంతో స్పందించిన ఆయన నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీమ ఇంటికి వెళ్లి సునీతను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా బాధ్యతగల పౌరుడిగా, ఆ మహిళను రక్షించడం నా నైతిక బాధ్యత అని ఈ పని చేసినట్టు వివేక్ తెలిపారు. అయితే ఒకానొక సందర్భంలో తాను బతికి ఉండడానికి ఆయుష్మానే కారణమని చెబుతూ సునీత కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.దాదాపు 8ఏళ్లుగా సునీత అనే మహిళను, సీమా పాత్ర తీవ్ర స్థాయిలో చిత్ర హింసలు పెడుతున్న ఘటన ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది. నాలుకతో టాయిలెట్ ను శుభ్రం చేస్తూ.. పళ్లు ఊడగొట్టి, ఆహారం కూడా సరిగా పెట్టకుండా సీమా రకరకాలుగా హింసించిన ఘటనకు సంబంధించి ఓ వీడియో బయటికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న పోలీసులు ఆ తరువాతి రోజు తెల్లవారుజామునే సీమా పాత్రాను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబరు 12 వరకు కోర్టు ఆమెను పోలీసు కస్టడీకి అప్పగించింది.