ఓడినా నైతిక విజయం బీజేపీదే

ఓడినా నైతిక విజయం బీజేపీదే
  • ఎమ్మెల్సీ అభ్యర్థులు రామచందర్ రావు, ప్రేమెందర్ రెడ్డి

హైదరాబాద్: పట్టభద్ర ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా.. నైతిక విజయం బీజేపీదేనని ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్ రావు పేర్కొన్నారు. తన పై గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవి కి అభినందనలు తెలిపారాయన. బిజెపి కి ఓటు వేసిన పట్టభద్రులకు కృత్ఞతలు తెలియజేశారు. మరో అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డితో కలసి బీజేపీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ.. ప్రజలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారని దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు నిరూపించాయని ప్రస్తావిస్తూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బిజెపి గెలిస్తే ప్రమాదమని అధికారాన్ని ఉపయోగించి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు ఇంటింటికి తిరిగి ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, నైతికంగా బీజేపి గెలిచిందన్నారు. టీఆర్ఎస్ గెలుపా? లేక నర్సింహ రావు గెలుపా? కెసీఆర్ చెప్పాలి అని డిమాండ్ చేశారు. మేము కూడా పీవీని గౌరవిస్తాం.. అంతేకాని టీఆర్ఎస్ గెలుపు కానే కాదన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ వారు 200 కోట్లు ఖర్చు చేశారు, బహిరంగానే డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి మీ గెలుపు నిజమైన గెలుపా? అని టీఆర్ఎస్ ను ప్రశ్నించారు. ఓటమి తో మేమేమీ కుంగిపోవడం లేదని.. 2023 ఎన్నికల్లో అధికారంలో వచ్చే విధంగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు.