తెలంగాణలో 350 మందికిపైగా ఎంపీడీవోలు బదిలీ

తెలంగాణలో 350 మందికిపైగా ఎంపీడీవోలు బదిలీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సుమారు 350 మందికి పైగా ఎంపీడీవోలను బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గడిచిన నాలుగేండ్లల్లో మూడేండ్లు తమ సొంత జిల్లాలో ఒకే దగ్గర పనిచేసిన వారిని ట్రాన్స్​ఫర్ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో కమిషనర్ పేర్కొన్నారు. బదిలీ అయిన ఎంపీడీవోలను కలెక్టర్లు సోమవారం రిలీవ్ చేయాలని ఆదేశించారు. 

బుధవారం కొత్త ప్లేస్ లలో జాయిన్ కావాలని ఎంపీడీవోలకు కమిషనర్ సూచించారు. త్వరలో జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, డిప్యూటీ సీఈవోలు, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ల బదిలీలు ఉంటాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని శాఖల్లో బదిలీ చేసిన అధికారుల రిపోర్ట్ ను సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు అందజేయాలని అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. టాప్ ప్రయారిటీగా ఈ అంశాన్ని తీసుకోవాలని సర్క్యులర్ లో పేర్కొన్నారు.